అమెరికాలోని అలాస్కా పీఠభూమిలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అధికారులు భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల వరకు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. సముద్ర తీరానికి సమీపంలో, దీవుల్లో, దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ సైరన్ మోగించారు.
బుధవారం 06:12 గంటలకు ప్రకంపనలు వచ్చాయి. ఆంకోరేజ్‌కు నైరుతి దిశగా 800 కిలోమీటర్ల దూరం, పెర్రివిలెకు ఆగ్నేయం దిశగా 96 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. తీవ్రత, ఇతర ప్రమాణాలను బట్టి భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల వరకు ప్రమాదకరంగా సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.