పక్కా ప్లానింగ్.. అంగుళం కూడా తేడా రాని గురి.. నిమిషంలో టార్గెట్‌ను మట్టుపెట్టి.. ఒక్క ఆధారం కూడా లభించకుండా అదృశ్యమైపోవడం.. ఇది ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ స్టైల్..!
గతేడాది ఇరాన్ టాప్ న్యూక్లియర్ సైంటిస్టు మొసిన్ ఫక్రిజాదె హత్య (Fakhrizadeh Assassination) విషయంలో ఇజ్రాయెల్ ప్లానింగ్ బాహ్య ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. కొన్ని వేల కిలోమీటర్ల అవతల నుంచి అంగుళం కూడా తేడా రాకుండా ప్రత్యర్థిని గురిపెట్టి వేటాడింది మొస్సాద్..! (Mossad Israel) తాజాగా ఆ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన కథనంలో వెల్లడించింది.
అదును కోసం మాటు వేసి..
అణ్వాయుధ తయారీలో యురేనియం ప్రధాన ఇంధనం. భూమి నుంచి వెలికితీసిన రూపంలో దీనిని వాడరు. శుద్ధిచేయాల్సి ఉంటుంది. ఇలా శుద్ధి చేసి ఆయుధ గ్రేడు యూరేనియం తయారీ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పెట్టిన పేరు 'గ్రీన్‌సాల్ట్ ప్రాజెక్టు'. దీనినే 'ప్రాజెక్టు1-11' అని కూడా అంటారు. ఇక్కడే క్షిపణుల వార్‌హెడ్‌లను కూడా తయారు చేస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టులో ఫక్రిజాదె కీలకమైన వ్యక్తి. ఆయన 14 ఏళ్ల నుంచి ఇరాన్ అణ్వాయుధ (Iran Nuclear Weapons) కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఆయన మొస్సాద్ హిట్‌లిస్ట్‌లో ఉన్న విషయం ఇరాన్ ఎప్పుడో పసిగట్టింది. దీంతో ఆయనకు దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రివల్యూషనరీ గార్డ్స్ రక్షణ కల్పించింది. బుల్లెట్ ప్రూఫ్ కారును సమకూర్చింది. ఫక్రిజాదెకు ఇవేవీ పెద్దగా ఇష్టంలేదు. చిన్నచిన్న సంతోషాలు తీర్చుకోవడానికి ఆయన చాలా తాపత్రయపడతారు. వారాంతాల్లో కాస్పియన్ సముద్రం వద్ద కుటుంబంతో గడపడం.. అబ్సార్డ్ అనే ఊళ్లో సమయం గడపడం ఇష్టం. చాలా సార్లు తన నిస్సాన్ టియాన కారులో ఎటువంటి భద్రత లేకుండా డ్రైవ్‌కు వెళుతుంటారు. గతేడాది నవంబర్ 27వ తేదీ మధ్యాహ్నం తన కారులో అబ్సార్డ్ పట్టణానికి బయల్దేరారు. ఫక్రిజాదె డ్రైవింగ్ సీట్లో కూర్చోగా.. ఆయన భార్య ప్యాసింజర్ సీట్లో కూర్చున్నారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది వేరే వాహనాల్లో ఆయన్ను అనుసరించారు.
ఫక్రిజాదె తన గమ్యస్థానానికి వెళ్లే మార్గంలో ఒక యూటర్న్ ఉంది. అదే సమయంలో ఆయన కాన్వాయ్‌లోని ముందు కారు కొంచెం వేగంగా ఫక్రిజాదె దిగాల్సిన ఇంటిని తనిఖీ చేసేందుకు వెళ్లిపోయింది. యూటర్న్ తీసుకొని పావు మైలు ప్రయాణించాక నిమిషం వ్యవధిలో మూడు విడతలుగా కాల్పులు జరిగాయి. దీంతో కారు డోరు తెరుచుకొని ఆయన రోడ్డుపై పడిపోయారు. ఆయనకు రక్షణగా ఉన్న సిబ్బందికి ఏమీ అర్థం కాలేదు. ఇంతలోనే సమీపంలోని ఒక జామ్యాద్ ట్రక్ భారీ శబ్దంతో పేలిపోయింది. తర్వాత ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వైఫల్యం బయటకు తెలియనీయకుండా దుండగులు వచ్చి కాల్పులు జరిపినట్లు ప్రచారం జరిగింది.
పక్కా లెక్కతో రోబో..!
ఫక్రిజాదె హత్యకు వాడిన కిల్లర్ రోబో తయారీ, తరలింపు విషయంలో ఇజ్రాయెల్ పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. ఇజ్రాయెల్ ఏదైనా దాడికి పథకం రచిస్తే.. దానిని అమలు చేసిన వారి ప్రాణాలు పోకుండా ఉండేలా చూస్తుంది. దాడిచేసిన ఇజ్రాయెల్ ఏజెంట్లు చనిపోతారనుకుంటే అసలు ఆ ప్లాన్నే చెత్తబుట్టలో పారేస్తుంది. ఇరాన్‌కు వెళ్లి అత్యంత భద్రత మధ్య ఉండే ఫక్రిజాదెను అంతం చేయడం ఇజ్రాయెల్ ఏజెంట్ల ప్రాణాలకు ముప్పు. దీంతో రోబో, కృత్రిమ మేథను వాడి దాడి చేయాలని నిర్ణయించుకొంది.