తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైతే భారత్​కు లాభం? - India-US relations

అగ్రరాజ్యం ఎన్నికలు ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతాయి. దీంతో ఈ సారి అమెరికా ఎన్నికలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. అయితే అగ్రరాజ్యాధినేతగా ఎవరు ఎన్నికైతే భారత్​కు ప్రయోజనాలు చేకూరుతాయి? భారత్-అమెరికా మధ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? వంటి ప్రశ్నలపై రాజకీయ పరిశీలకులు ఏం చెబుతున్నారు..?

Irrespective of the winner of presidential polls, India-US relationship to remain strong
అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైతే భారత్​కు లాభం?

By

Published : Nov 3, 2020, 7:23 PM IST

ప్రతిష్ఠాత్మక అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో ఏ పార్టీ విజయం సాధించినా భారత్‌- అమెరికా మధ్య సంబంధాలు ధృఢంగానే ఉంటాయని పరిశీలకులు చెబుతున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినా, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలుపొందినా.. భారత్‌పై ప్రతికూల ప్రభావం ఉండదని విశ్లేషిస్తున్నారు. అమెరికా- భారత్ మధ్య సంబంధాలకు ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. రెండు పార్టీల విధానాలను, ప్రచారంలో ఇరువురు నేతలు వ్యాఖ్యలను పరిశీలిస్తే భారత్‌తో వ్యూహ్మాత్మక సంబంధాలను కొనసాగించడం సహా మరింత బలోపేతం చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోందని చెబుతున్నారు.

వారిని గమనిస్తే..

ట్రంప్ తన తొలి హయాంలో భారత్‌కు ముఖ్యస్నేహితుడిగా మారిపోయిన విషయాన్ని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ట్రంప్ హయాంలో భారత్‌తో సంబంధాలను శ్వేతసౌధం మరోస్థాయికి తీసుకుపోయిన విషయాన్నిప్రస్తావిస్తున్నారు. ఈ తరుణంలో ట్రంప్‌నకు, ప్రధాని మోదీకి మధ్య స్నేహం పెరగడాన్ని గుర్తుచేస్తున్నారు. ట్రంప్‌తో కలిసి మోదీ.. అమెరికా, భారత్‌లలో నిర్వహించిన సభలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెబుతున్నారు. ప్రధాని మోదీతో పెరిగిన సాన్నిహిత్యాన్ని, స్నేహం గురించి ప్రముఖంగా ప్రస్తావించిన ట్రంప్.. భారత్‌ నుంచి తనకు గొప్ప మద్దతు లభిస్తోందని సెప్టెంబర్‌లో వ్యాఖ్యానించారు. దీంతో పాటు గతేడాది సెప్టెంబర్‌లో హూస్టన్‌లో జరిగిన 'హౌదీ మోదీ' సభలో మోదీ అద్భుతంగా పనిచేస్తున్నట్లు ట్రంప్ కితాబిచ్చిన అంశాలను విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.

అణు ఒప్పందంలో బైడెన్​ పాత్ర

అటు.. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ సైతం భారత్‌తో మంచి సంబంధాలనే కోరుకుంటున్నారు. డెలవేర్‌ సెనేటర్‌గా పనిచేసిన మూడు దశాబ్దాల కాలంలోనూ, బరాక్ ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఎనిమిదేళ్ల సమయంలోనూ భారత్‌తో మంచి సంబంధాలను కొనసాగించిన రికార్డు జో బైడెన్‌కు ఉంది. రిపబ్లికన్ల పరిపాలనలో భారత్‌- అమెరికా మధ్య పౌర అణు ఒప్పందం ఆమోదం పొందడంలో బైడెన్ కీలకపాత్ర పోషించారు. ఇదే సమయంలో భారత్- అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 500 బిలియన్ అమెరికన్ డాలర్ల లక్ష్యాన్ని నెలకొల్పడంలో ప్రధాన పాత్ర పోషించారు. మొదటి నుంచి భారత్‌తో బలమైన సంబంధాలను కలిగి ఉన్న బైడెన్‌కు అత్యధిక శాతం మంది భారతీయ అమెరికన్ల మద్దతు ఉంది.

'అందుకు గర్వంగా ఉంది'

జులైలో జరిగిన ఓ నిధుల సమీకరణ కార్యక్రమంలో భారత్​-అమెరికా సహజ భాగస్వాములని బైడెన్ వ్యాఖ్యానించారు. భారత్​తో సంబంధాలను.. వ్యూహాత్మక భాగస్వామ్యంగా అభివర్ణించిన బైడెన్.. భద్రతకు సంబంధించి అవసరమైన, ముఖ్యమైన మిత్రుడిగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే భారత్- అమెరికాల మధ్య పౌర అణు ఒప్పందం ఆమోదం పొందడంలో తనపాత్రపట్ల గర్వపడుతున్నట్లు బైడెన్ పలు సందర్భాల్లో చెప్పారు. భారత్ అమెరికా అణు ఒప్పందాన్నిఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఎనిమిదేళ్ల కాలంలో తాను సాధించిన అతిపెద్ద విజయంగా అభివర్ణించారు. ఒబామా హయాంలో భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామంటున్న బైడెన్.. అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేస్తున్నారు. బైడెన్.. భారత్​కు ఇచ్చే ప్రాధాన్యతను ఈ వ్యాఖ్యలు తెలియజేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.

స్వల్ప భేదాలు ఉన్నప్పటికీ..

అధ్యక్ష ఎన్నికల తర్వాత భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సంబంధించి దిల్లీలో ఇటీవల జరిగిన 2+2 సమావేశంలోనే పునాదులు పడ్డాయి. అమెరికాలోఏ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న అంశంపై ఆధారపడి ఇరుదేశాల మధ్య సంబంధాలు ఉండవన్న అధికారులు.. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ముఖ్యంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా అమెరికన్ కాంగ్రెస్‌లో ఏ పార్టీ మెజారిటీ సాధించినా.. ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి కొన్ని అంశాలలో స్వల్ప బేధాలు ఉన్నప్పటికీ రెండు దేశాల ఉమ్మడి జాతీయ ప్రయోజనాలైన ప్రజాస్వామ్యం, చైనా నుంచి ఎదురయ్యే ముప్పు అంశాలకు ఇరుదేశాలు ప్రాధాన్యమిస్తాయని విశ్లేషకులు అంటున్నారు.

వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోని దేశం..

ట్రంప్ పాలనలో రక్షణ, ఎనర్జీ అంశాలు.. ఇరుదేశాల వ్యూహాత్మక సంబంధాలలో ప్రధానాంశాలుగా నిలిచాయి. వీటితో పాటు కరోనా దృష్ట్యా ఆరోగ్య రంగంలో పరస్పర సహకారం, కలిసి పనిచేయడంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. అయితే ద్వైపాక్షిక వాణిజ్యం, విదేశీయులకు ఇచ్చే పనివీసాలకు సంబంధించిన అంశాలలో ఎలాంటి పురోగతి లేదు. ఇదే సమయంలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంలో ట్రంప్ యంత్రాంగం విఫలమైంది. ఇరుదేశాల ఉన్నతాధికారులు సుముఖంగా ఉన్నప్పటికీ.. మినీ ట్రేడ్ డీల్‌ సైతం కుదుర్చుకోలేకపోయింది. ఫలితంగా ట్రంప్‌ పాలనలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోని ఏకైక పెద్ద దేశంగా భారత్ మిగిలింది.

సంబంధాలు మెరుగవుతాయా?

గత మూడు దశాబ్దాల కాలాన్ని పరిశీలిస్తే బైడెన్ హయాంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలు నేటికి అలానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా అధికార పగ్గాలు ఎవరు చేపట్టినా.. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా వేగంగా అడుగులు వేస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ దిశగా ఇప్పటికే జరిగిన చర్చలను అధికారులు తిరిగి ప్రారంభిస్తారని చెబుతున్నారు. రక్షణ రంగ పరికరాల కొనుగోళ్లకు సంబంధించి భారత్ మరిన్ని ఆర్డర్లు చేస్తుందని.. ద్వైపాక్షిక ఎనర్జీ ట్రేడ్‌ను ఇరుదేశాలు మరోస్థాయికి తీసుకుపోతాయని చెబుతున్నారు.

బైడెన్ అధికారంలోకి వస్తే.. వాతావరణ మార్పు అంశం ద్వైపాక్షిక సంబంధాలలో ఉన్న ప్రాధాన్యాంశాలలోకి చేరుతుందని పరిశీలకులు అంటున్నారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బైడెన్​- హారిస్​‌ యంత్రాంగం.. మానవహక్కుల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని విశ్లేషిస్తున్నారు. ట్రంప్ గెలిస్తే.. హెచ్​1బీ వీసాలు, భారత్‌లో పన్నుల అంశానికి సంబంధించి తొలి హయాంలో అవలంబించిన విధానాలనే ట్రంప్‌ సర్కారు కొనసాగించే అవకాశముందని చెబుతున్నారు.

చైనా దూకుడుకు కళ్లెం!

మరోవైపు తాను అధికారంలోకి వస్తే పెరుగుతున్న నిరంకుశత్వ ధోరణులకు వ్యతిరేకంగా తొలి ఏడాదిలోనే ప్రజాస్వామ్య దేశాలతో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తానని బైడెన్ ఇటీవల ప్రకటించారు. ఈ సదస్సులో.. ఎన్నికల్లో భద్రత, మానవహక్కులపై చర్చిస్తానని వెల్లడించారు. దీనిలో భారత్ కీలకపాత్ర పోషించే అవకాశముంది. ట్రంప్ హయాంలో భారత్‌ అమెరికాతో కీలక భాగస్వామిగా ఉంది. ముఖ్యంగా కీలకమైన ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేసేదిశగా అమెరికాతో కలిసి పనిచేసింది.

ఇదీ చూడండి:ట్రంప్ ​X బైడెన్​: గెలిచేదెవరో తేలేది కోర్టులోనే!

ABOUT THE AUTHOR

...view details