ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటివరకు 6.63 కోట్ల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. వారిలో 15.27లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. ఇప్పటివరకు 4కోట్ల 59లక్షల మంది కొవిడ్‌ను జయించగా.. కోటీ 89లక్షల యాక్టివ్ కేసులున్నాయి.
- కరోనా కేసుల పరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 14.78 లక్షల కేసులు నమోదయ్యాయి. వారిలో 2.85లక్షల మందిని కొవిడ్ బలితీసుకుంది.
- రష్యాలో వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే 28,782 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24లక్షల 31వేలు దాటింది. ఆ దేశంలో ఇప్పటివరకు 42,684 కరోనా మరణాలు సంభవించాయి.
- ఇరాన్లో కొవిడ్ మృతుల సంఖ్య 50వేలు దాటింది. లాక్డౌన్ ఆంక్షలను సడలించడం వల్లే వైరస్ మరణాలు పెరిగిపోతున్నాయని అక్కడి అధికారులు వెల్లడించారు. ఆ దేశంలో ఇప్పటివరకు 10లక్షల 28వేలకుపైగా వైరస్ కేసులు వెలుగుచూశాయి.
- పొరుగుదేశం నేపాల్‌లో మరో 1,024 మందికి కరోనా సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 2.39లక్షలకు ఎగబాకింది. మహమ్మారి ధాటికి మరో 10 మంది బలవ్వగా.. మరణాల సంఖ్య 1,577కు చేరింది.