ప్రపంచాన్నంతటినీ భారతదేశం ఒకే కుటుంబంగా భావిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. (Modi US trip 2021) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్వహించిన గ్లోబల్ కొవిడ్ సమ్మిట్‌లో (Covid Global summit) ప్రసంగించిన మోదీ.. కొవిడ్ మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని అన్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ జరగాల్సి ఉందన్నారు. ఇలాంటి సమయంలో వ్యాక్సినేషన్‌పై బైడెన్ తీసుకున్న చొరవను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
"మానవాళినంతటినీ భారత్ ఒకే కుటుంబంగా చూస్తుంది. భారత ఫార్మా రంగం తక్కువ ధరలో డయాగ్నోస్టిక్ కిట్లు, మందులు, మెడికల్ పరికరాలు, పీపీఈ కిట్లను తయారు చేసింది. అందుబాటు ధరల్లోనే వీటిని కొనుగోలు చేసేలా అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవకాశం ఏర్పడింది. కరోనా సమయంలో మందులు, ఇతర సామాగ్రిని 150కు పైగా దేశాలకు పంపిణీ చేశాం. దేశీయంగా తయారు చేసిన రెండు టీకాలకు అత్యవసర అనుమతులు లభించాయి. ఇతర సంస్థలు సైతం టీకా తయారీలో నిమగ్నమయ్యాయి."
-నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం (World's largest Vaccination drive) భారత్‌లో కొనసాగుతోందని మోదీ పేర్కొన్నారు. ఇటీవల ఒకేరోజు 2.5 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు చెప్పారు. 20 కోట్ల మందికి పైగా భారతీయులు రెండు డోసులు తీసుకున్నారని, మొత్తంగా 80 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశామని వివరించారు. టీకా నిల్వలు పెరిగితే.. ఇతర దేశాలకూ పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ట్రిప్స్ నిబంధనల సడలింపు (Trips waiver WTO) అంశాన్ని ప్రస్తావించారు.