కరోనా కారణంగా విమాన రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వెల్లడించింది. కొవిడ్-19 విజృంభణతో 2020-22 మధ్య ప్రపంచ విమానయాన రంగానికి 201 బిలియన్ డాలర్ల నష్టం(సుమారు 14లక్షల కోట్ల రూపాయలు) వాటిల్లిందని పేర్కొంది. 2019తో పోలిస్తే విమానయాన సేవలు 22శాతం మాత్రమే నడుస్తున్నాయని తెలిపింది. ఈ మేరకు అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ 77వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పలు అంశాలను వెల్లడించింది. 'విమాన పరిశ్రమలో సమస్యలు ఉన్నప్పటికీ రికవరీకి మార్గం ఉందనిపిస్తోంది' అని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ విశ్లేషించారు.
"ఆర్థిక వ్యవస్థలు క్రమంగా పుంజుకుంటున్నాయి. అయితే కరోనా ఉద్ధృతి తగ్గుతున్నప్పటికీ వివిధ దేశాలు తమ గగనతలాలను ఉపయోగించకుండా ఆంక్షలు విధించడం సరికాదనిపిస్తోంది."
-విల్లీ వాల్ష్, ఐఏటీఏ డైరెక్టర్ జనరల్