కరోనా ప్రతాపం రోజురోజుకూ తీవ్రమవుతోంది. అంతకంతకూ విస్తరిస్తూ కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. చిరుజల్లులా మొదలైన కరోనా బాధితుల సంఖ్య నేడు మహాసంద్రాన్ని తలపిస్తోంది. ఈ మహమ్మారి ఇంతలా విజృంభించడానికి కారణం దీనికి మందు లేకపోవడమే.
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టే దిశలో వివిధ దేశాలు తలమునకలై ఉన్నాయి. ఎంత వేగంగా వ్యాక్సిన్ కనిపెట్టినా అందుబాటులోకి వచ్చేసరికి ఏడాది పట్టేలా ఉంది. ఈ పరిస్థితుల్లో కరోనాను కట్టడి చేయలేమా? అంటే మాత్రం వైద్యులు తాత్కాలిక విధానాలను సూచిస్తున్నారు. గతంలో ప్రబలిన అంటువ్యాధుల నియంత్రణలో కీలకపాత్ర పోషించిన రోగ నిరోధకాల మార్పిడి విధానమే ఉత్తమమని విశ్వసిస్తున్నారు.
కోలుకున్నవారి ప్లాస్మా నుంచి..
రోగ నిరోధకాల మార్పిడి విధానం ప్రకారం... కరోనా నుంచి కోలుకున్న వారి రక్తంలోనున్న రోగ నిరోధకాలను కరోనాతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న వారికి అందిస్తే వారి శరీరానికి వైరస్‌తో పోరాడే శక్తి లభిస్తుంది.
చైనాకు చెందిన సదరన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆచార్యులు.. వుహాన్‌లోని 5 మంది కరోనా బాధితులపై పరిశోధన చేశారు. వెంటిలేటర్లతో చికిత్స అవసరం ఉన్నవారికి ఈ పద్ధతి ద్వారా రోగ నిరోధకాలను శరీరంలోకి ఎక్కించారు. తద్వారా వారు ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో నలుగురు 12 రోజుల తర్వాత పూర్తిగా కోలుకున్నారు.
కొంత మేర ప్రయోజనమే..
ప్రఖ్యాత ఫెయిర్లీ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఈ పరిశోధన చేశారు. ఈ సిద్ధాంతం ప్రకారం వ్యాధి కారకం మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటిని నాశనం చేయడానికి రోగ నిరోధక శక్తి.. ప్రతిరక్షకాలను జనించేలా చేస్తుంది. ఆ ప్రతిరక్షకాలు ఆ వ్యాధి కారకాన్ని నాశనం చేస్తాయి. అనంతరం కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు ఆ ప్రతి రక్షకాలు మన శరీరంలో అలాగే ఉంటాయి.
అంటే ఒక వ్యక్తిలోని రోగ నిరోధకాలను మరో రోగికి ఇస్తే... ఆ వ్యక్తి శరీరంలోనూ రోగ నిరోధకాలు జనించి వ్యాధి కారకాలపై పోరాడతాయి. ఈ విధానం ద్వారా వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనాను కొంత కట్టడి చేయవచ్చని విశ్లేషించింది జార్జియాకు చెందిన ఏమోరి విశ్వవిద్యాలయం.
మరణాలను తగ్గించవచ్చు..
అమెరికాలోని 'జర్నల్ ఆఫ్ ద అమెరికన్ మెడికల్ అసోసియేషన్' పత్రిక దీని గురించి కూలంకుషంగా వివరించింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి కరోనా సోకగా వేలాది మంది మరణించారు. సానుకూలాంశం ఏమిటంటే బాధితుల్లో 85 % మంది కోలుకుంటున్నారు. అంటే వీళ్లందరిలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఉందన్నమాట.
వారి రక్తంలో ఉండే ప్రతి రక్షకాలు కొత్తగా శరీరంలోకి వచ్చిన కరోనా వైరస్‌ను దీటుగా ఎదుర్కొన్నాయి. ప్రస్తుతానికైతే కరోనాకు మందు లేదు. ఈ పరిస్థితుల్లో వైద్యులు చూస్తున్న ప్రత్యామ్నాయం ఈ విధానమే. దీని ద్వారా కొంత మేర కరోనా మరణాలను తగ్గించవచ్చని అభిప్రాయపడింది.