ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వ్యూహాత్మక, రక్షణ అంశాల్లో సత్సంబంధాలు ఉన్నాయి. ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బాగానే కొనసాగుతున్నాయి. ఏటా దాదాపు 142 బిలియన్ డాలర్ల మేర వాణిజ్యం జరుగుతోంది. అయితే ఇమిగ్రేషన్, కొన్ని ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాల్లో మాత్రం ఇంకా సమస్యలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనలో వాటికి చెక్ పడుతుందని అందరూ అనుకున్నా.. అలా జరగలేదు.
యూఎస్‌ఐఎస్‌పీఎఫ్(యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరం) ఇటీవల నిర్వహించిన వార్షిక సమావేశం అనంతరం వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలకు ముందు పరిమిత వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాలు సంతకం చేయొచ్చని ప్రకటించారు.
ఈ అంశాలన్నింటిపై సీనియర్ జర్నలిస్ట్ స్మితాశర్మ కొందరు నిపుణులతో చర్చించారు. భారత్ ఎదుర్కొంటున్న వాణిజ్య, ఆర్థిక సవాళ్లపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
" రాబోయే నెలల్లో ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం జరుగుతుందా లేదా అనేది స్పష్టంగా చెప్పలేను. కానీ అమెరికా.. భారత్‌కు జీఎస్పీ (జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్) స్టేటస్ తిరిగి ఇవ్వగలదు. అది 6-8 బిలియన్ డాలర్లు ఉంటుంది. రాబోయే నెల లేదా రెండు నెలల్లో అధ్యక్షుడు దీనిపై సంతకం చేయవచ్చు. ఇది ఒక చిన్న ఒప్పందంలాగా ఉంటుంది.పెద్ద వాణిజ్య ఒప్పందానికి సమస్యలు ఉన్నాయి. భారత్, అమెరికా జాతీయవాద, రక్షణవాదులు. సుంకాల రాజు అని పిలిచే అగ్రరాజ్యంతో అమెరికా ఫస్ట్ అనే విధానాలు పెట్టుకుంటే భారత్‌కు ఇబ్బంది. ఇప్పటికే ఇరుదేశాల మధ్య వ్యవసాయ రాయితీలు, మేధో సంపత్తి హక్కులు వంటి అనేక అంశాల్లో సమస్యలు ఉన్నాయి. కాబట్టి రాబోయే రెండు నెలల్లో అమెరికన్ అధ్యక్షుడు వాటిని పరిష్కరించడం కష్టం. తర్వాతి ప్రభుత్వం బైడెన్ లేదా ట్రంప్‌దో తెలియదు. కానీ ఒకరివైపు మొగ్గు చూపడం భారత్‌కు కచ్చితంగా మంచిది కాదు"
-- డాక్టర్ అపర్ణా పాండే, హడ్సన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్
2021 తొలి త్రైమాసికంలో భారత్-అమెరికా మధ్య ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు కుదరకపోవచ్చని అభిప్రాయపడ్డారు ఫ్రాన్స్‌లో భారత రాయబారిగా పనిచేసిన మోహన్ కుమార్.
" చైనా, భారత్‌ను.. అమెరికా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణించాలని అనుకోవట్లేదు. కానీ చైనాను, భారత్‌ను కలిపి ఒకేలా పోల్చడం న్యాయం కాదనేది మన వాదన. చైనా 13 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉంటే భారత్ ఆర్థిక వ్యవస్థ 2.7 ట్రిలియన్ డాలర్లు మాత్రమే. ఈ విషయాన్నే వచ్చే ప్రభుత్వానికి మనం గట్టిగా చెప్పాలి. మత్స్య సంపద విషయంలోనూ రాబోయే బహుపాక్షిక చర్చల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల స్థితిని తిరిగి పొందాలి. మన దేశాన్ని చైనాతోనే పోలిస్తే డబ్ల్యూటీఓలో చర్చలు జరపలేము. కాబట్టి దీనిపై చాలా దృష్టిపెట్టాల్సి ఉంది.