అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మూడేళ్ల తర్వాత తొలిసారి భారత్‌లో పర్యటించనున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ నెల చివరి వారంలో భారత్ రానున్నారు. ఈ పర్యటనతో భారత్-అమెరికా మధ్య తలెత్తిన వాణిజ్య విభేదాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ట్రంప్ పర్యటనలోనే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రణాళికలు జరుగుతున్నట్లు తెలిపాయి. కొన్ని నిర్దిష్ట రంగాలను కలుపుకొని చేసే ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి భారత్, అమెరికా అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం.
"అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనలోనే వాణిజ్య ఒప్పందం సహా రక్షణ రంగంలో సహకారంపై ఒప్పందం కుదిరే అవకాశం ఉంది."
- అధికార వర్గాలు.
ఈనెల 23-26 మధ్య..
ఈనెల 23 నుంచి 26 మధ్య రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు అధ్యక్షుడు ట్రంప్. ఈ పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు ఇరు దేశాల అధికారులు. ట్రంప్ పర్యటన ప్రధానంగా దేశ రాజధాని దిల్లీలోనే ఉంటుంది. అయితే.. మరో నగరాన్ని సందర్శించే అంశాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు. అందులో ప్రధానంగా ఆగ్రా, అహ్మదాబాద్‌లు ఉన్నాయి.
ట్రంప్ విదేశీ పర్యటనలను పరిశీలించే ఉన్నత స్థాయి అధికారుల బృందం ఇప్పటికే భారత్‌లో పర్యటించింది.