తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాకు భారత్​ దీటుగా బదులు చెప్పింది: పాంపియో

సరిహద్దుల్లో చైనా దూకుడుకు భారత్ అదే స్థాయిలో సమాధానమిచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. చైనా చర్యలను ప్రపంచం అర్థం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే చైనా ఒంటరి కావటం తథ్యమని అంచనా వేశారు.

sinoindia Pompeo
మైక్ పాంపియో

By

Published : Jul 9, 2020, 6:44 AM IST

Updated : Jul 9, 2020, 7:11 AM IST

చైనాతో సరిహద్దు వివాదం విషయంలో భారత్​ దీటుగా బదులిచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రశంసించారు. చైనా దుందుడుకు చర్యలకు సరైన రీతిలో స్పందించిందని అన్నారు. చైనా ప్రాదేశిక వివాదాలను కావాలని సృష్టిస్తోందని.. ఇందుకు ప్రపంచం అనుమతించకూడదని సూచించారు.

చైనా సరిహద్దుల విస్తరణకు సంబంధించి అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారు పాంపియో.

"గత నెలలో గల్వాన్ ఘటన గురించి భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్‌తో పలుమార్లు మాట్లాడాను. సరిహద్దులో చైనా చాలా దూకుడుగా వ్యవహరించింది. భారత్ కూడా దీటుగానే బదులిచ్చింది.

త్వరలోనే షీ జిన్‌పింగ్ పార్టీ నుంచి పొంచి ఉన్న ముప్పును ప్రపంచం అర్థం చేసుకుంటుందని తనకు గట్టి నమ్మకం ఉంది. చైనా ఒంటరి అవుతుంది. అలానే చైనా చర్యలకు సరైన రీతిలో స్పందించేందుకు అన్ని దేశాలూ కలిసి వస్తాయని భావిస్తున్నాం."

- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి

డోభాల్​ భేటీ తర్వాత..

లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా దురాక్రమణలను భారత్ సైన్యం అడ్డుకుంది. అందులో భాగంగా జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అప్పటి నుంచి ఇరు దేశాలు సరిహద్దు ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించాయి.

ఈ పరిణామాల నడుమ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో రెండు గంటల పాటు మాట్లాడారు. ఈ భేటీ తర్వాత చైనా వెనక్కు తగ్గింది. తన బలగాలను సుమారు రెండు కిలోమీటర్ల మేర ఉపసంహరించుకుంది.

అయితే చైనా ఉపసంహరణ ప్రక్రియను భారత్‌ నిశితంగా పరిశీలిస్తోంది. ఒక వేళ చైనా మరోసారి దుందుడుకు చర్యలకు దిగితే దీటుగా బదులిచ్చేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:అమెరికా 'ఏకపక్షవాదానికి' అది నిదర్శనం: చైనా

Last Updated : Jul 9, 2020, 7:11 AM IST

ABOUT THE AUTHOR

...view details