సెల్ఫీచిత్రాల్లో అందంగా కనిపించేందుకు భారత్, అమెరికా యువత ఫిల్టర్ యాప్లను అధికంగా వాడుతున్నారని గూగుల్ సంస్థ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. దాదాపు 70శాతానికిపైగా భారతీయులు ఫ్రంట్ కెమెరాలోనే ఫోటోలు తీసుకుంటున్నారని తెలిపింది. సెల్ఫీదిగటం, వాటిని పంచుకోవటంలో భారత మహిళలు ముందున్నారని పేర్కొంది. సెల్ఫీలు స్త్రీల ప్రవర్తనపై ప్రభావం చూపుతున్నాయని వెల్లడైంది. వారి ఆర్థిక పరిస్థితిపైనా సెల్ఫీచిత్రాల ప్రభావం పడుతుందని నివేదిక వివరించింది.
మగువలు ముందు వరుసలో..
భారత స్త్రీలు తమ చిత్రాలకు మెరుగులు దిద్దటంలో ఎంతో ఉత్సాహం ప్రదర్శిస్తున్నారని తేలింది. సెల్ఫీలు తీసుకోవటం, ఇతరులతో పంచుకోవటం మగువల జీవితంలో భాగమైపోయిందని గూగుల్ తన అధ్యయనంలో వివరించింది.
అయితే మగవారు సైతం సెల్ఫీలను బాగానే తీసుకుంటారు, కానీ వారు అందం కంటే ఎక్కువగా ఏ సందర్భంలో ఫొటో దిగారో వివరించటంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారని సర్వేలో వెల్లడైంది.