కొవిడ్-19 మహమ్మారి పంజా విసురుతున్న వేళ పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు చేసిన ప్రయత్నాలకుగాను ఓ భారతీయ పర్యటక సంస్థ.. ప్రతిష్ఠాత్మక యూఎన్ అవార్డును దక్కించుకుంది. మారుమూల గ్రామాలు సౌర విద్యుత్తును (సోలార్ ఎనర్జీ) పొందేందుకు సహాయపడిన పర్యటక- సాంకేతిక సంస్థ ది గ్లోబల్ హిమాలయన్ ఎక్స్‌పెడిషన్(జీహెచ్ఈ).. 'యూఎన్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డు-2020'ను పొందిన సంస్థల్లో ఒకటిగా నిలిచింది.
ఈ అవార్డుకు ఎంపికైన జాబితాను మంగళవారం ప్రకటించింది యూఎన్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్(యూఎన్ఎఫ్సీసీసీ). ఈ ఏడాదిలో పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా కృషి చేసిన వ్యక్తులు, సంస్థలను ఒక ఉదాహరణగా చూపటమే లక్ష్యమని పేర్కొంది. పర్యటకం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రిమోట్ కమ్యూనిటీలకు సౌర విద్యుత్తును అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటైన తొలి సంస్థల్లో జీహెచ్ఈ ఒకటి అని తెలిపింది.