తెలంగాణ

telangana

ETV Bharat / international

రోదసిలోకి అడుగు పెడుతున్న తొలి తెలుగు మహిళ - శిరీష రోదసి ప్రయాణం

విశ్వవినువీధిలో తెలుగు కీర్తిపతాకం ఎగరబోతోంది. రోదసిపై తొలిసారి ఒక తెలుగు మహిళ అడుగుపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష ఈ ఘనత సాధించనున్నారు. కల్పనాచావ్లా, సునీత విలియమ్స్‌ తర్వాత రోదసీయానం చేయనున్న భారత సంతతి మహిళగా శిరీష చరిత్ర పుటలకెక్కనున్నారు.

Shirisha Bandla, Virgin Galactic, Shirisha Bandla set to fly into space
శిరీష బండ్ల, అంతరిక్షయానం

By

Published : Jul 10, 2021, 7:56 PM IST

అంతరిక్ష వీధుల్లో తెలుగు కీర్తి పతాకం రెపరెపలాడే సమయం ఆసన్నమైంది. రోదసియానం చేయనున్న తొలితెలుగు మహిళగా గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష చరిత్ర సృష్టించనున్నారు. ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్‌ గెలాక్టిక్ ఆదివారం మానవ సహిత వ్యోమనౌక వీఎస్‌ఎస్‌ యూనిటీ-22ని నింగిలోకి పంపనుంది. అందులో ఆసంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్​తో పాటు మరో అయిదుగురు ప్రయాణించనుండగా వారిలో 34ఏళ్ల శిరీష కూడా ఉన్నారు.

శిరీష వ్యోమనౌకలో పరిశోధన అంశాలను పర్యవేక్షించనున్నారు. ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఒక ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఈ యాత్ర విజయవంతమైతే భారత్‌ నుంచి అంతరిక్షానికి వెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష చరిత్ర పుటలకెక్కనున్నారు. ఇంతకుముందు రాకేశ్‌ శర్మ, కల్పనా చావ్లా, భారత-అమెరికన్‌ సునీతా విలియమ్స్‌ రోదసిలోకి వెళ్లి వచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష తల్లిదండ్రులతోపాటు అమెరికాలోని హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. పర్‌డ్యూ విశ్వవిద్యాలయం నుంచి ఏరోనాటికల్‌-ఆస్ట్రోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు. జార్జ్‌ వాషింగ్టన్‌ వర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. ప్రస్తుతం ఆమె వర్జిన్‌ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details