తెలంగాణ

telangana

ETV Bharat / international

నుదుటిపై తిలకం.. ఒంటిపై అమెరికా వాయుసేన యూనిఫాం.. శెభాష్ దర్శన్​! - దర్శన్​ షా ఎయిర్​ఫోర్స్​

Darshan Shah US Air Force: శక్తిమంతమైన అమెరికా వాయుసేన యూనిఫామ్​.. భారతీయతను చాటిచెప్పేలా నుదుటికి తిలకం.. ఈ రెండింటి కాంబినేషన్​ను ఎప్పుడైనా ఊహించారా? అసలు సాధ్యమేనా? కానీ.. సుసాధ్యం చేసి చూపించారు భారత సంతతి వ్యక్తి దర్శన్ షా. యూనిఫాంలో ఉన్న సమయంలోనూ తిలకం పెట్టుకునేందుకు అమెరికా వాయుసేన నుంచి ప్రత్యేక అనుమతి పొందారు. ఇందుకోసం చాలా పెద్ద పోరాటమే చేశారాయన.

indian man in us
దర్శన్​ షా

By

Published : Mar 22, 2022, 9:00 PM IST

Darshan Shah US Air Force: అమెరికా వాయుసేనలో ఎయిర్​మ్యాన్​గా చేస్తున్న భారత సంతతి వ్యక్తి దర్శన్ షా.. అరుదైన ఘనత సాధించారు. యూనిఫాంలో ఉన్న సమయంలోనూ నుదుటికి తిలకం పెట్టుకునేందుకు వాయుసేన నుంచి ప్రత్యేక అనుమతి పొందారు. ఇందుకోసం అనేక ఏళ్లు శ్రమించిన ఆయన.. ఇప్పుడు తిలకంతో విధులకు హాజరవుతూ అందరి మన్ననలు పొందుతున్నారు.

ప్రస్తుతం వ్యోమింగ్​లోని ఎఫ్​ఈ వారెన్​ ఎయిర్​ఫోర్స్​ బేస్​లో పనిచేస్తున్నారు దర్శన్. 2022 ఫిబ్రవరి 22న తొలిసారి ఆయన తిలకం పెట్టుకుని విధులకు హాజరయ్యారు. ఆన్​లైన్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న అనేక మంది ఆయన్ను అభినందనల్లో ముంచెత్తుతున్నారు.

నుదుటిపై తిలకంతో అమెరికా వాయుసేన యూనీఫామ్​లో దర్శన్​ షా

"టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, న్యూయార్క్​ నుంచి నా స్నేహితులు అభినందిస్తూ మెసేజ్​లు చేస్తున్నారు. నా తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అమెరికా వాయుసేనలో ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇదే తొలిసారి. మా ఆధ్యాత్మిక గురువు 'గురుహరి మహంత్ స్వామి మహారాజ్' నాతో ఫోన్లో మాట్లాడారు. ఆయన చాలా సంతోషపడ్డారు. గతంలో ఎప్పుడూ జరగని పనిని నేను చేశానంటూ నన్ను ఆశీర్వదించారు." అని ఆనందంగా చెప్పారు దర్శన్ షా.

ఎయిర్​ఫోర్స్ బేస్​లోని 'మైటీ నైన్టీ' దళంలోని సహచరులూ తనను అభినందిస్తున్నారని చెప్పారు దర్శన్. ఈ మతపరమైన మినహాయింపు పొందేందుకు నేను ఎంత శ్రమించానో వారికి బాగా తెలుసని అన్నారు. ఇందుకోసం తాను పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు.

"యూనిఫాంలో ఉన్నా తిలకం పెట్టేందుకు అనుమతించాలని మిలటరీ ట్రైనింగ్ స్కూల్​లో ఉండగానే నేను కోరా. అయితే.. టెక్ స్కూల్​కు వెళ్లాక ప్రయత్నించమని వాళ్లు చెప్పారు. టెక్ స్కూల్​లో ఇదే విషయం అడిగితే.. డ్యూటీలో చేరాక అక్కడి అధికారుల్ని సంప్రదించమని అన్నారు. ఇన్నాళ్లకు నాకు అనుమతి లభించింది. తిలకం.. నేనేంటో చెబుతుంది. తిలకం పెట్టుకోవడం ఎంతో ప్రత్యేకం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు అదొక మార్గం. అది నాకు దారి చూపుతుంది. నాకు ఎంతో మంది స్నేహితుల్ని ఇచ్చింది. ఈ ప్రపంచంలో నేనెవరో అర్థం చేసుకునే వీలు కల్పించింది" అని వివరించారు దర్శన్.

"అమెరికా వాయుసేన, తిలకం.. ఈ రెండూ నా ప్రధాన గుర్తింపులు. ఇప్పుడు ఈ రెండూ కలిపి ధరించడం నాకెంతో గర్వకారణం. యూనిఫాంలో ఉన్నా, లేకపోయినా మతపరమైన భావప్రకటనా స్వేచ్ఛ ఉన్న దేశంలో జీవిస్తున్నందుకు ఆనందంగా ఉంది." అని అన్నారు దర్శన్ షా.

ఇదీ చూడండి :రష్యాపై ఆంక్షలకు భారత్​ వణుకుతోంది: బైడెన్​

ABOUT THE AUTHOR

...view details