కొద్ది రోజుల క్రితం తెలుగు యువతి శిరీష బండ్ల అంతరిక్షయానం చేసి అరుదైన రికార్డు సృష్టించారు. వర్జిన్ గెలాక్టిక్ చేపట్టిన యాత్రలో భాగంగా శిరీష రోదసిలోకి వెళ్లొచ్చి అంతరిక్ష రంగంలో భారత నారీమణుల శక్తిసామర్థ్యాలను చాటిచెప్పారు. తాజాగా ఈ జాబితాలో మరో దేశీయ యువతి చేరారు. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ త్వరలో ప్రయాణించే వ్యోమనౌక 'న్యూ షెపర్డ్' అభివృద్ధిలో మరాఠా అమ్మాయి సంజల్ గవాండే కీలక పాత్ర పోషించారు. ఇంతకీ ఎవరీ సంజల్..? మహారాష్ట్ర నుంచి బ్లూ ఆరిజిన్ వరకు ఎలా వెళ్లారు..?
ఈ నెల 20వ తేదీన తన బ్లూ ఆరిజిన్ సంస్థ ద్వారా బెజోస్ అంతరిక్ష యానం చేయనున్నారు. తనతో పాటు మరో ముగ్గురిని రోదసిలో తీసుకెళ్లనున్నారు. ఇందుకోసం న్యూ షెపర్డ్ వ్యోమనౌకను సంస్థ అభివృద్ధి చేసింది. ఈ బృందంలో సంజల్ గవాండే కూడా సభ్యురాలు. బ్లూ ఆరిజిన్‌లో సిస్టమ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సంజల్.. న్యూ షెపర్డ్ తయారీలో కీలక పాత్ర పోషించారు.