అమెరికాలో డెమొక్రాట్ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఓటమిని ఇంకా అంగీకరించని అధ్యక్షుడు ట్రంప్ అధికార మార్పిడికి సహకరించనప్పటికీ.. ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్ పాలనా యంత్రాంగంపై దృష్టిపెట్టారు. మంత్రివర్గ కూర్పుపై కసరత్తులు మొదలుపెట్టారు. మొదట్నుంచీ భారత్‌పై సానుకూలంగా వ్యవహరిస్తున్న బైడెన్.. తన కేబినెట్‌లోనూ భారత అమెరికన్లకు చోటు కల్పించనున్నట్లు సమాచారం. ప్రముఖ భారత అమెరికన్లు వివేక్ మూర్తి, అరుణ్ మజుందార్‌ను తన మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. కొవిడ్ 19పై జో బైడెన్‌కు సలహాదారుగా ఉన్న వివేక్ మూర్తికి ఆరోగ్యం; స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ అరుణ్ మజుందార్‌కు ఇంధన శాఖ కేటాయించే అవకాశాలున్నట్లు 'ది వాషింగ్టన్ పోస్ట్', 'పొలిటికో' కథనాలు వెల్లడించాయి.
ఎవరీ వివేక్ మూర్తి?
45 ఏళ్ల వివేక్ మూర్తి అమెరికాలో మంచి పేరున్న వైద్యుడు. ఒబామా, ట్రంప్ పాలన సమయంలో దేశానికి సర్జన్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. పబ్లిక్ హెల్త్ సర్వీస్ కమిషన్ కోర్‌కు వైస్ అడ్మిరల్ హోదాలో విధులు నిర్వహించారు. డాక్టర్స్ ఫర్ అమెరికా సంస్థను స్థాపించారు. కర్ణాటక నుంచి యూకేకు వలస వచ్చిన మూర్తి కుటుంబం.. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడింది. ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయం, యేల్ విశ్వవిద్యాలయాల్లో మూర్తి చదివారు. కొన్ని నెలలుగా ఆయన బైడెన్‌కు కరోనాపై మార్గదర్శకత్వం చేస్తున్నారు. మేలో బైడెన్ ప్రచార బృందం ఏర్పాటు చేసిన హెల్త్ టాస్క్ ఫోర్స్‌కు కాంగ్రెస్ మహిళ ప్రమిలా జయపాల్‌తో కలిసి నేతృత్వం వహించారు. అధికార మార్పిడి తర్వాత బైడెన్ నియమించే కొవిడ్-19 అడ్వైజరీ బోర్డుకు వివేక్ మూర్తి సహ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు.