అమెరికాకు వలస వెళ్లి నివసించే వారిలో సంఖ్యాపరంగా భారతీయులది రెండో స్థానం. కొన్ని దశాబ్దాలుగా అక్కడే ఆవాసం ఉంటున్నప్పటికీ, వారి సంతానం అమెరికాలోనే జన్మించి పౌరసత్వం పొందినప్పటికీ వివక్ష భావన ఎదురవుతూనే ఉందని బుధవారం విడుదలైన ఓ నివేదిక వెల్లడించింది. జాతీయ ప్రాతినిధ్య విధానం ఆధారంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన సర్వేలో 1200 మంది భారతీయ అమెరికన్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, జాన్స్‌హాప్కిన్స్-ఎస్‌ఏఐఎస్; పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం సంయుక్తంగా 2020 సెప్టెంబరు 1-20 మధ్య ఈ సర్వేను చేపట్టాయి. పరిశోధన, విశ్లేషణ సంస్థ యుగవ్ కూడా దీనిలో భాగస్వామిగా వ్యవహరించింది. అమెరికా జనాభాలో భారతీయ అమెరికన్లు ఒక శాతానికి పైగా (46లక్షల మంది) ఉంటారని అంచనా.
US: భారతీయ అమెరికన్లలో వివక్ష భావన! - అమెరికాలో భారతీయులు
అమెరికాలో జన్మించి పౌరసత్వం పొందినప్పటికీ భారతీయ అమెరికన్లలో వివక్ష భావన ఎదురవుతూనే ఉందని ఓ నివేదిక వెల్లడించింది. ప్రతి ఇద్దరిలో ఒకరు గత ఏడాది తాము శరీర వర్ణం ఆధారిత పక్షపాత వైఖరికి గురైనట్లు తెలిపినట్లు స్పష్టం చేసింది. జాతీయ ప్రాతినిధ్య విధానం ఆధారంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన సర్వేలోని మరిన్ని అంశాలు ఇలా..
భారతీయ అమెరికన్లలో వివక్ష
సర్వే వెల్లడించిన ముఖ్యమైన అంశాలు..
- భారతీయ అమెరికన్లకు నిత్యం వివక్ష ఎదురవుతోంది. ప్రతి ఇద్దరిలో ఒకరు గత ఏడాది తాము శరీర వర్ణం ఆధారిత పక్షపాత వైఖరికి గురైనట్లు తెలిపారు.
- వివక్షకు సంబంధించిన ఫిర్యాదులు చేసిన వారిలో అమెరికాలో జన్మించిన భారత సంతతి వారే అధికంగా ఉన్నారు.
- భారతీయ అమెరికన్లు తమ సొంత సామాజిక వర్గాల్లోని వారినే జీవిత భాగస్వాములను చేసుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
- సర్వేలో పాల్గొన్న ప్రతి పది మంది భారతీయ అమెరికన్లలో 8మంది జీవిత భాగస్వాములు స్వదేశీ సంతతికి చెందినవారే.
- అమెరికాలోనే జన్మించిన భారత సంతతి వారైతే తమ మాదిరిగానే యూఎస్‌లో పుట్టి పెరిగిన భారత సంతతి వారినే జీవిత భాగస్వాములుగా పొందటానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సామాజిక వర్గం కూడా ప్రాధాన్య అంశమే.
- భారతీయ అమెరికన్ల జీవితాల్లో మతం అత్యంత కీలకపాత్ర వహిస్తుంది. సామాజిక వర్గం, ప్రాంతీయత ఆ తర్వాత ప్రాధాన్యాలుగా ఉన్నాయి.
- యుఎస్ పౌరసత్వం కలిగిన భారతీయ అమెరికన్లు స్థానిక, రాజకీయ వ్యవహారాల్లో చరుగ్గా పాల్గొంటున్నారు.
- ఒకే సామాజిక నేపథ్యం ఉన్న భారతీయ అమెరికన్లలో వ్యక్తులుగా, సమూహాలుగా వారి మధ్య సాన్నిహిత్యం అధికంగా ఉంటోంది. సమీకరణలకూ అది కీలకాంశమే.
- భారతీయ సమాజంలోని వైవిధ్యాలు అమెరికాకు వచ్చిన వారిలోనూ ప్రతిబింబిస్తుంటాయి.
ఇదీ చూడండి:ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన నగరమేది?