తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​పై హ్యూస్టన్​లో నిరసనలు - ఉగ్రవాదుల స్వర్గధామం

ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ, అల్ప సంఖ్యాక వర్గాల ప్రజలపై వేధింపులకు పాల్పడుతున్న పాకిస్థాన్​ దురాగతాలకు వ్యతిరేకంగా భారతీయ-అమెరికన్​లు హ్యూస్టన్​లో నిరసన కార్యక్రమం చేపట్టారు.

పాక్ దురాగతాలపై భారతీయ అమెరికన్​ల నిరసన

By

Published : Mar 17, 2019, 3:38 PM IST

అమెరికా హ్యూస్టన్​లో భారతీయ అమెరికన్లు, పాకిస్థాన్​కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పాక్​ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని, అల్పసంఖ్యాక వర్గాల వారిని వేధింపులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఆగడాలను తెలిపే విధంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రపంచ దేశాలు, పౌర సమాజం పాకిస్థాన్ దురాగతాలను ప్రశ్నించాలని విన్నవించారు.

హ్యూస్టన్​లో ఇండియా సొసైటీ ఇంటర్నేషనల్​, గ్లోబల్ కశ్మీరీ పండిట్​ డైయాస్పొరా సంస్థల ఆధ్వర్యంలో సుమారు 300 మంది భారతీయ అమెరికన్లు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాకిస్థాన్​ తన భూభాగంలో ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తోందని విమర్శించారు. కశ్మీర్​లో అల్పసంఖ్యాకులుగా ఉన్న కశ్మీరీ పండిట్లకు రక్షణ లేకుండా పోయిందని, వారిని వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కశ్మీర్​లోని హిందువులను, సిక్కులను నిర్మూలనకు పాకిస్థాన్​ జాతి విద్వేషపూరిత దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఫలితంగా సుమారు 4 లక్షల మంది దేశాన్ని విడిచి వలస వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ నేపథ్యం...

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో ఫిబ్రవరి 14న జైషే మహమ్మద్​ జరిపిన ఉగ్రదాడిలో భారత సీఆర్పీఎఫ్ జవానులు 40 మంది అమరులయ్యారు. ప్రతీకారంగా భారత్​ పాకిస్థాన్​లోని బాలాకోట్​లోని జైష్​ ఉగ్రవాద స్థావరాలపై దాడిచేసి నాశనం చేసింది. ప్రతిగా పాక్​ భారత భూభాగంపై వైమానిక దాడికి పాల్పడింది. దీనిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ సమయంలో భారత పైలెట్​ అభినందన్​ పాక్​ ఎఫ్​-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశారు. అనంతరం తన మిగ్​ యుద్ధ విమానాన్ని కోల్పోయి పాక్​ చెరలో చిక్కారు. భారత్ దౌత్యం, అంతర్జాతీయ ఒత్తిడితో పాక్​ వింగ్ కమాండర్​ అభినందన్​ను విడిచిపెట్టింది. అయినా నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్​ ఉల్లంఘిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details