అమెరికాలో భారతీయ మూలాలున్న మరో మహిళకు కీలక పదవి లభించనుంది. వివిధ స్థాయిల్లోని న్యాయమూర్తుల పదవులకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం ప్రతిపాదించిన పదిమందిలో రూపా రంగా పుట్టగుంట ఒకరు. ఆమెను డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా(డీసీ) జిల్లా కోర్టు న్యాయమూర్తి పదవికి నామినేట్ చేస్తున్నట్లు శ్వేత సౌధం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రతిపాదనకు సెనెట్ ఆమోదం కూడా లభిస్తే.. డీసీ జిల్లా కోర్టు జడ్జి పదవికి ఎంపికైన మొట్టమొదటి ఆసియా అమెరికన్ మహిళగా రూపా రంగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొంది.
న్యాయ సహాయకురాలిగా..
ప్రస్తుతం ఆమె రెంటల్ హౌసింగ్ కమిషను జడ్జిగా ఉన్నారు. 2013-19 వరకు న్యాయవాదిగా ఉంటూ క్రిమినల్ కేసులను వాదించారు. గృహహింసకు సంబంధించిన కేసుల్లో స్వచ్ఛంద న్యాయ సహాయాన్ని అందిస్తూ మంచి పేరు సంపాదించారు. రూపా రంగా న్యాయవాద వృత్తి ప్రారంభంలో (2008-10) డీసీ సుపీరియర్ కోర్టు జడ్జి విలియం జాక్సన్‌కు న్యాయ సహాయకురాలిగా ఉన్నారు. రూపా రంగా కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులకు సంబంధించిన సమాచారాన్ని శ్వేత సౌధం వెల్లడించనప్పటికీ ఆమె ఆహార్యం. పేరును బట్టి తెలుగు మూలాలున్న వ్యక్తిగా తెలుస్తోంది.