కరోనా వైరస్‌తో ప్రపంచం స్తంభించింది. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కరోనాపై పోరులో అటు అమెరికా తీవ్ర చర్యలు చేపట్టడం.. ఇటు భారత్‌లో లాక్డౌన్ కొనసాగుతుండటం వల్ల అక్కడి భారతీయ విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ-అమెరికన్లు వారికి అండగా నిలుస్తున్నారు. తమ హొటళ్లలో వారికి ఉచితంగా వసతి, భోజనం అందిస్తున్నారు.
మొత్తంగా 2 లక్షల 50 వేల మంది విద్యార్థులకు.. దాదాపు 700 హోటళ్లలోని 6 వేల గదులు కేటాయించారు. ఇదంతా అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్‌తో సాధ్యపడింది.
ఆపన్న హస్తం
మార్చి 22న అనేక మంది భారతీయ విద్యార్థులను హాస్టళ్లు ఖాళీ చేయాలని అధికారులు అదేశాలు జారీ చేశారు. దీని వల్ల 2లక్షల 50వేల వసతి కోసం ఎదురుచూశారు. ఏషియన్ అమెరికన్ హొటల్ ఓనర్స్ అసోసియేషన్(ఏఏహెఓఏ) పిలుపుతో యజమానులు భారీ సంఖ్యలో సహాయం చేయడానికి ముందుకొచ్చారు. తొలుత విద్యార్థుల నుంచి రోజుకు 20-25 డాలర్లు వసూలు చేయాలనుకున్నారు. కానీ యజమానుల్లో కొందరు ఉచితంగా వసతి, భోజనం ఇవ్వడం చూసి.. మిగిలిన వారూ ఛార్జీల ఆలోచనను విరమించుకున్నారు.
ఇప్పటివరకు అమెరికాలో కరోనా వైరస్ సోకి 1,031 మంది మరణించగా... 68 వేల 572 వైరస్ బారిన పడ్డారు.
ఇదీ చూడండి :'కరోనా చికిత్సకు 69 ఔషధాలు గుర్తింపు!'