అమెరికాలోని మాసాచుసెట్స్ రాష్ట్రంలో నివాసం ఉంటున్న ఓ మహిళ లాటరీ తగల్లేదని పరధ్యానంగా దుకాణంలోని చెత్తకుండీలో పడేసిన టికెట్ మిలియన్ డాలర్లు(రూ.7.27కోట్లు) గెలుచుకుంది. ఆ దుకాణం నిర్వహిస్తున్న ఓ భారతీయ కుటుంబం ఈ విషయం గమనించి దీర్ఘకాలంగా తమ వినియోగదారుగా ఉన్న ఆమెకు టికెట్‌ను తిరిగి అప్పగించి అందరి మనసులు గెలుచుకొంది. మాసాచుసెట్స్ రాష్ట్రంలోని సౌత్విక్ పట్టణంలో ఓ భారతీయ కుటుంబం 'లక్కీ స్టాప్' పేరిట దుకాణం నిర్వహిస్తోంది.
ఈ దుకాణానికి తరచూ వచ్చే లీ రోజ్ ఫిగా అనే స్థానిక మహిళ గత మార్చిలో వారి వద్ద డైమండ్ మిలియన్స్ స్క్రాచ్-ఆఫ్ లాటరీ కొన్నారు. లాటరీ ఫలితాన్ని చూసుకునేందుకు ఇటీవల దుకాణానికి వచ్చిన లీ రోజ్ ఫిగా పరధ్యానంలో టికెట్ స్క్రాచ్ చేసి చూసింది.
రూ.7కోట్లు చెత్తకుండీలోకి!..
'మధ్యాహ్న భోజన విరామంలో దుకాణానికి వెళ్లా. సమయం తక్కువగా ఉండటంతో.. పైపైన గీకి చూసి లాటరీ తగల్లేదులే అంటూ టికెట్‌ను అక్కడే పడేసి వచ్చేశా' అని ఆమె తెలిపింది. అక్కడే చెత్తలో పదిరోజుల పాటు పడున్న ఆ టికెట్ దుకాణ యజమాని అభి షా కంటపడింది. పూర్తిగా స్క్రాచ్ చేయకుండా ఉన్న దాన్ని గీకి చూసిన అభి అవాక్కయ్యాడు. ఆ టికెట్ మిలియన్ అమెరికన్ డాలర్లు గెలుచుకుంది.!