మూడు పదుల వయసున్న ఓ భారతీయ అమెరికన్ కుర్రాడు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చురుకైన పాత్ర పోషించారు. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ బృందంలో కీలక బాధ్యతలు చేపట్టి ఆసియన్ అమెరికన్లను ఏకతాటిపై నడిపించారు. బైడెన్‌ను విజయ తీరాలకు చేర్చడంలో మరపురాని పాత్ర పోషించారు. అతడే అమిత్ జానీ. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన 30 ఏళ్ల అమిత్ జానీ.. బైడెన్ ప్రచార బృందంలో ‘నేషనల్ ఆసియన్ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్’ విభాగానికి డైరెక్టర్ హోదాలో సారథ్యం వహించారు. అమెరికాలో నివసిస్తున్న 50 ఆసియన్ పసిఫిక్ జాతుల ఓటర్లు బైడెన్ వైపు ఆకర్షితులయ్యేలా వ్యూహాలు రచించారు. ఇందుకోసం అమెరికాలో గతంలో ఎవరూ చేయని రీతిలో జాతీయ స్థాయిలో ఓ ప్రచార విధానాన్ని రూపొందించారు. అందులో 14 ఆసియా పసిఫిక్ జాతులను భాగం చేయడంతోపాటు కీలక రాష్ట్రాల్లో నాయకత్వ మండళ్లను ఏర్పాటు చేశారు. సౌత్ ఆసియన్స్ ఫర్ బైడెన్ బృంద రూపకల్పనలో సహకారం అందించారు. దీని సారథ్యంలో బైడెన్‌కు మద్దతునిచ్చే ఇండియన్ అమెరికన్లు, హిందువులు, సిక్కులు, జైనులు తదితర వర్గాలను సంఘటితం చేశారు. ఆగస్టు 15న అమెరికా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ భారతీయ అమెరికన్ల నేతృత్వంలో భారీ వర్చువల్ ఈవెంట్ నిర్వహించారు. ఇది అత్యధిక మంది వీక్షించిన కార్యక్రమంగా నిలిచింది. ప్రైమరీ ఎన్నికల సమయంలో బైడెన్ బృందంలో చేరిన అమిత్.. ఆయన అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికవడంలోనే కాదు.. ఆసియన్ ఓటర్లలో 71 శాతం మంది బైడెన్ వైపు మొగ్గుచూపేలా చేసి ఆయన్ను అధ్యక్ష పీఠానికి చేరువచేయడంలోనూ విజయం సాధించారు.
టాస్క్‌ఫోర్స్‌లో భారతీయ అమెరికన్‌కు చోటు