అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ గొంతుకులాగా నిలబడుతుందని ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తి వెల్లడించారు. మానవాళికే శత్రువులుగా భావించే ఉగ్రవాదం వంటి వాటిపై గళమెత్తేందుకు భారత్ వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలకు మానవ కేంద్రంగా పరిష్కరించేందుకు ఐరాస భద్రతా మండలిలోని తన పదవీకాలాన్ని భారత్ ఉపయోగించుకుంటుందని పేర్కొన్నారు. భద్రతామండలిలో చేరనున్న తాత్కాలిక దేశాల ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భద్రతా మండలిలో భారత్ చేరింది. బహుపాక్షికత, న్యాయ నిబంధనలు, అందరికీ సమానమైన అంతర్జాతీయ శాంతిభద్రతల వ్యవస్థ, అభివృద్ధికు భారత్ కట్టుబడి ఉంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మేమందరం ఒక్కటిగా ఐకమత్యంతో నిలబడతాం. అంతర్జాతీయ శాంతిభద్రల సమ్యలకు మానవ కేంద్రంగా సాగే పరిష్కారాలను తీసుకొచ్చేందుకు భద్రతా మండలిలోని పదవీకాలాన్ని భారత్ ఉపయోగించుకుంటుంది. మానవాళికే శత్రువులుగా భావించే ఉగ్రవాదం వంటి వాటిపై పోరాడేందుకు గళమెత్తడానికి భారత్ వెనకడుగు వేయదు. ప్రపంచం ఓ వసుదైక కుటుంబం అనే సిద్ధాంతాన్ని అనుసరించేందుకు భారత్ కృషి చేస్తుంది."