దేశంలో ఎన్నికలు నిర్వహించాలని పాలస్తీనా తీసుకున్న నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, న్యాయబద్ధంగా జరిగేలా అన్ని వర్గాలు సరైన చర్యలు తీసుకోవాలని సూచించింది. పశ్చిమాసియాలో పరిస్థితులపై భద్రతా మండలిలో జరిగిన బహిరంగ చర్చలో మాట్లాడిన ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి... సరిహద్దు దేశాలతో చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం కోసం పాలస్తీనా ప్రయత్నించడాన్ని కొనియాడారు.
"పాలస్తీనాలో శాశన, జాతీయ మండలితో పాటు అధ్యక్ష పదవికి ఈ ఏడాది ఎన్నికలు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని భారత్ స్వాగతిస్తోంది. పాలస్తీనా ప్రజల ప్రజాస్వామ్యయుతమైన ఆకాంక్షలను సాకారం చేసేందుకు ఈ ఎన్నికలు దోహదం చేస్తాయి. ఇందుకోసం అన్ని వర్గాలు అవసరమైన చర్యలు తీసుకోవాలి."
-టీఎస్ తిరుమూర్తి, ఐరాసలో భారత ప్రతినిధి
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న పరిణామాలపై మాట్లాడారు తిరుమూర్తి. ఇజ్రాయెల్-అరబ్ దేశాల మధ్య మైత్రి చిగురించడంపై హర్షం వ్యక్తం చేశారు. సంబంధాలు సాధారణ స్థాయికి చేరడాన్ని స్వాగతించారు. ఈ పరిణామాలు ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యేందుకు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. పాలస్తీనా పార్టీల మధ్య అనుబంధాన్ని పెంచేందుకు ఈజిప్ట్ చేసిన సహకారాన్ని తిరుమూర్తి ప్రశంసించారు. పశ్చిమాసియాలో శాంతి పరిరక్షణకు గల్ఫ్ సహకార మండలి(జీసీసీ) పోషిస్తున్న పాత్రను కొనియాడారు. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి సమగ్ర పరిష్కారం కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇజ్రాయెల్‌తో శాంతిస్థాపన కోసం సంబంధిత వర్గాలతో కలిసి అంతర్జాతీయ శాంతి సదస్సును నిర్వహించాలన్న పాలస్తీనా అధ్యక్షుడు మహముద్ అబ్బాస్ ప్రతిపాదనను స్వాగతించారు.
లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య చర్చలు పునఃప్రారంభం కావడంపై స్పందించిన తిరుమూర్తి... లెబనాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు కోసం భారత్ ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. పశ్చిమాసియాకు కరోనా టీకాల సరఫరాకు భారత్ నుంచి సహకారం అందుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:'భారత్ మరింత శక్తివంత దేశంగా ఎదగాలి'