కొవిడ్‌పై పోరాటంలో అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నాయకత్వ పాత్రను గుర్తించటం కోసం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ సహా 168 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. 193 దేశాలు సభ్యత్వం కల్గిన ఐరాస సాధారణ సభలో అమెరికా, ఇజ్రాయెల్ ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా.. ఉక్రెయిన్, హంగేరీ సహా పలు దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి.
ఈ మేరకు ఐరాసలో భారత శాశ్వత ఉపప్రతినిధి నాగరాజు నాయుడు ట్వీట్ చేశారు.
" కరోనా మహమ్మారిని ప్రపంచ అతిపెద్ద సవాల్‌గా గుర్తించి.. అంతర్జాతీయ సహకారానికి పిలుపునిచ్చిన ఐరాస తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది."
- కె.నాగరాజు నాయుడు, ఐరాసలో భారత శాశ్వత ఉప ప్రతినిధి
ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా కరోనా వైరస్‌ను చరిత్రలోనే అతిపెద్ద సవాల్‌గా సాధారణ సభ..అభివర్ణించింది. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అంతర్జాతీయ సహకారం అందించుకోవాలని పిలుపునిచ్చింది. మహమ్మారి వల్ల ఉద్భవిస్తున్న సామాజిక, ఆర్థిక ప్రభావాలపై అంకితభావం, దృఢత్వంతో కూడిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
చర్చలో పాల్గొన్న అమెరికా ప్రతినిధులు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనాలపై విమర్శలు గుప్పించారు. కరోనా వ్యాప్తిపై చైనా వాస్తవాలను దాచిపెట్టిందని అమెరికా ఆరోపించింది.
ఇదీ చూడండి: డబ్ల్యూహెచ్ఓ నిధుల సమీకరణకు 'ఐరాస' పిలుపు