ఐరాస భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో తాత్కాలిక సభ్యదేశంగా ఉన్న భారత్.. తన పదవీ కాలంలో కీలక తాలిబన్, లిబియా ఆంక్షల కమిటీతో పాటు ఉగ్రవాద నిరోధక కమిటీకి అధ్యక్షత వహించనుంది. ఈ విషయాన్ని ఐరాసలో భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తి వెల్లడించారు.
"భద్రతా మండలిలో మూడు కీలకమైన కమిటీలకు అధ్యక్షత వహించాలని భారత్‌ను కోరారు. ఈ విషయాన్ని వెల్లడించేందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అవి.. తాలిబన్ ఆంక్షల కమిటీ, ఉగ్రవాద నిరోధక కమిటీ(సీటీసీ), లిబియా ఆంక్షల కమిటీ. ఆఫ్ఘానిస్థాన్‌లో శాంతి, భద్రత, అభివృద్ధికి కట్టుబడి ఉన్న భారత్‌కు ఇది అత్యంత ప్రాధాన్యంతో కూడిన విషయం. 2022లో సీటీసీకి భారత్ అధ్యక్షత వహిస్తుంది. అదే సమయంలో భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడం విశేషం."