UNSC Vote on Russia: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC)లో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండడం గమనార్హం. తక్షణమే ఉక్రెయిన్ (Ukraine) నుంచి రష్యా (Russia) బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. అమెరికా, అల్బేనియా సంయుక్తంగా రూపొందించిన ఈ తీర్మానంపై ఐరాస భద్రతా మండలి ఓటింగ్ నిర్వహించింది. పోలండ్, ఇటలీ, లక్సెంబర్గ్, న్యూజిలాండ్ సహా 11 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. భారత్, చైనా, యూఏఈ దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
UNSC meeting Ukraine
'విభేదాలు, వివాదాలను పరిష్కరించడానికి చర్చలు ఒక్కటే సమాధానం. అయితే, ఈ క్షణంలో అది కొంత సాధ్యమయ్యే పని కాదని అనిపించినప్పటికీ తప్పదు. ఇరు వర్గాలు దౌత్య మార్గాన్ని వదులుకోవడం విచారించదగ్గ విషయం. మనం తిరిగి ఆ మార్గానికే రావాలి. ఈ కారణాలన్నింటి వల్ల భారతదేశం ఈ తీర్మానానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది' అని ఐరాసలో భారత శాశ్వత రాయబారి టి.ఎస్.తిరుమూర్తి వివరించారు.
ఊహించినట్లుగానే భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశంగా ఉన్న రష్యా తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగించి తీర్మానాన్ని అడ్డుకుంది. మాస్కో వర్గాలు ఈ తీర్మానం వీగిపోయేలా చేస్తాయని ముందుగానే ఊహించినట్లు అమెరికా తెలిపింది. అయితే, ఈ ఓటింగ్ ద్వారా అంతర్జాతీయ వేదికపై రష్యా ఒంటరితనాన్ని చూపించినట్లు పేర్కొంది. అలాగే ఉక్రెయిన్‌పై పుతిన్ సేనల సైనిక చర్యను ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నట్లు నిరూపించగలిగామని వివరించింది. 'మీరు ఈ తీర్మానాన్ని మాత్రమే అడ్డుకోగలరు. మా గళాన్ని, నిజాన్ని, సిద్ధాంతాలను, ఉక్రెయిన్ ప్రజల్ని మాత్రం అడ్డుకోలేరు' అని అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: