తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా సంక్షోభం భారత్‌కు సువర్ణావకాశం: అమెరికా

కరోనా సంక్షోభం భారత్​కు సువర్ణావకాశమని అమెరికా సీనియర్ దౌత్యవేత్త ఎలైస్​ వెల్స్​ అభిప్రాయం వ్యక్తం చేశారు. వాణిజ్య సంబంధాలకు ముందడుగు వేయాలని సూచించారు. చైనా నుంచి ఇతర దేశాలు తప్పుకోవాలని చూస్తున్నతరుణంలో.. భారత్ ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. తాము ఒప్పందాలకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

India should utilize the Market Opportunity says USA diplomat Alice Wells
భారత్‌కు సువర్ణావకాశం

By

Published : May 21, 2020, 11:49 AM IST

కరోనా వైరస్‌తో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభాన్ని భారత్‌ సద్వినియోగం చేసుకోవాలని, అది ఓ సువర్ణావకాశమని అమెరికాకు చెందిన సీనియర్‌ దౌత్యవేత్త ఎలైస్‌ వెల్స్‌ అభిప్రాయపడ్డారు. ఓ మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి భారత్‌ ముందడుగు వేయాలని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అయితే తమతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి ముందు భారత్‌ ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందాలు బలపడడానికి అమెరికా ఎంతగానో ఎదురుచూస్తోందని ఎలైస్‌‌ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి తొలగిపోయాక తమ కంపెనీలు వాటి సేవలను విస్తరించాలని చూస్తున్నాయని.. అది భారత్‌కు మంచి అవకాశమని వివరించారు. భారత్‌ రక్షణాత్మక ధోరణితో కాకుండా స్నేహపూర్వక విధానాలతో ముందుకు రావాలని సూచించారు.

తమది వాణిజ్య ఒప్పందాలు చేసుకునే దేశమని, నిర్ణయాలు కఠినంగా ఉన్నా.. అలాగే చేస్తామని స్పష్టం చేశారు. భారత్‌ మాత్రం ఆ స్థాయిలో ఒప్పందాలు చేసుకునేలా కనిపించడం లేదని చెప్పారు ఎలైస్​. అలా వ్యవహరించడం వల్ల అమెరికా ఒక్కదాంతోనే సమస్య కాదని.. ఐరోపా సమాఖ్య, ఆస్ట్రేలియా లాంటి ఇతర దేశాలతోనూ భారత సంబంధాలు దెబ్బతింటాయన్నారు. చైనా మార్కెట్ల నుంచి ఇతర దేశాలు తప్పుకోవాలని చూస్తున్న నేపథ్యంలో భారత్‌కు మంచి అవకాశం లభిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌.. సరైన విధానాలు, మౌలిక సదుపాయాలతో ముందుకు వస్తే అర్ధవంతంగా ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే అమెరికా సైతం భారత్‌కు చేయూతనివ్వాలని చూస్తుందని ఆమె వివరించారు.

రెండేళ్లుగా...

భారత్‌, అమెరికా గత రెండేళ్లుగా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని చూస్తున్నాయని.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా(గత సెప్టెంబర్‌లో) త్వరలో ఈ ఒప్పందాలపై సంతకం చేస్తానని చెప్పినట్లు ఎలైస్‌ గుర్తుచేశారు. ఫిబ్రవరిలో ట్రంప్‌.. భారత పర్యటన సందర్భంగా అది కార్యరూపం దాల్చుతుందని భావించినా కుదరలేదు. ఎలాంటి వాణిజ్య ఒప్పందంలోనైనా కొన్ని సమస్యలుంటాయని, రెండేళ్లుగా తాము వాటిపైనే దృష్టిపెట్టామని చెప్పారు. మరోవైపు అమెరికా ఉత్పత్తుల విషయంలో సుంకం తగ్గించాలనుకుంటే అది అధ్యక్షుడి నిర్ణయమని స్పష్టంచేశారు ఎలైస్​. దీంతో భారత్‌ తన మార్కెట్‌ను తెరవడానికి ఎంతవరకు సిద్ధంగా ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

మరోవైపు ఔషధ రంగంలోనూ భారత్‌ ఎంతో మెరుగైనస్థితిలో ఉందని, ట్రంప్ కూడా దాన్ని గుర్తించారని ఎలైస్‌ తెలిపారు. కరోనా టీకా అభివృద్ధికి భారత్‌ కీలక భాగస్వామి అని, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అమెరికాతో కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు సీనియర్​ దౌత్యవేత్త.

ABOUT THE AUTHOR

...view details