అంతర్జాతీయ మేధోసంపత్తి సూచీ(ఐపీ)లో భారత్ 40వ ర్యాంకు సాధించింది. ఈమేరకు అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలిసీ సెంటర్(జీఐపీసీ) 2020కి సంబంధించి వార్షిక ర్యాంకులను మంగళవారం విడుదల చేసింది. 53 ప్రపంచ ఆర్థిక రంగాల మేధో సంపత్తి హక్కులను జీఐపీసీ మదింపు చేసింది. ఇందులో భాగంగా పేటెంట్, కాపీరైట్, విధానాల నుంచి మేధోసంపత్తి వ్యాపారీకరణ, అంతర్జాతీయ ఒప్పందాల ధ్రువీకరణ వరకు వివిధ అంశాలను మదింపు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఐపీ 2020లో మెరుగు పడినట్లు జీఐపీసీ సూచి వెల్లడించింది. ర్యాంకులకు సంబంధించిన 8వ సంచికలో మొత్తం 50 మేధోసంపత్తి అంశాలపై భారత్ 38.46 శాతం స్కోరు సాధించినట్లు జీఐపీసీ నివేదికలో తెలిపింది. ఏడో సంచిక(36.04 శాతం) కంటే భారత్ స్కోరు పెరిగినట్లు వెల్లడించింది. గత కొద్ది సంవత్సరాలుగా భారత్ వాస్తవిక వృద్ధిని కనబరుస్తోందని పేర్కొంది.