ప్రపంచవ్యాప్తంగా కరోనా విధ్వంసం కొనసాగుతోంది. మానవాళిపై వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య కొత్త శిఖరాలకు చేరుతోంది. గత 24 గంటల్లోనే కొత్తగా 81,390 మందికి కరోనా సోకింది. మరో 4,675 మందిని వైరస్ కబలించింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,96,956కి చేరింది. కేసుల సంఖ్య 28 లక్షలు దాటగా... 7,80,085 మంది వైరస్ బారి నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
అగ్రరాజ్యంలో 52 వేల మరణాలు
అమెరికాను కరోనా కబలిస్తోంది. అగ్రరాజ్యంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా ఉద్ధృతితో ఇప్పటివరకు 52 వేలకుపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం బాధితుల సంఖ్య 9 లక్షలు దాటిపోయింది. 24 గంటల వ్యవధిలో 3,176 మంది ప్రాణాలు విడిచారు. దీంతో ఇప్పటివరకు అమెరికాలో మృతి చెందిన వారి సంఖ్య 52,087కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసుల్లో మూడింట ఒక వంతు కేసులు అమెరికాలోనే నమోదవుతున్నాయి.
ఓ వైపు దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ అమెరికాలోని పలు రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తున్నాయి. నిపుణుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. హెయిర్ సెలూన్లు, స్పాలకు ఆంక్షలనుంచి మినహాయిస్తున్నట్లు జార్జియా, ఓక్లహోమా ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే భౌతిక దూరం సహా పలు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించాయి.
బ్రిటన్
బ్రిటన్లో వైరస్ మరణాలు 20 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 684 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో మరణాల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో బ్రిటన్లో కరోనా నియంత్రణ అవుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయని యూకే రవాణా సెక్రెటరీ గ్రాంట్ షాప్స్ పేర్కొన్నారు. ప్రజలంతా ఇళ్లలో ఉండి, భౌతిక దూరం పాటించడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. అయితే సంక్షోభం ముగిసిపోలేదని, కేసులు మరింత తగ్గుముఖం పట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు.