కొవిడ్-19పై చేస్తున్న పోరులో ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్లు తయారు చేస్తున్న భారత ప్రైవేటు రంగానిది కీలక పాత్ర అని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ స్పష్టం చేశారు. భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) గురువారం సాయంత్రం నిర్వహించిన ఆన్‌లైన్ సింపోజియంలో పాల్గొన్న ఆయన తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్‌ఐహెచ్)తో పాటు ఇతర కీలక సంస్థలు భారత్‌తో కలిసి పనిచేసేందుకు కృషి చేస్తామన్నారు. సమర్థమైన వ్యాక్సిన్‌ను తీసుకొచ్చేందుకు భారత శాస్త్రవేత్తలు, పరిశోధకులను కలుపుకొని పోతామన్నారు. ఎన్ఐహెచ్‌లో భాగమైన అమెరికా జాతీయ అలర్జీ, అంటువ్యాధుల సంస్థ(ఎన్‌ఐఏఐడీ)కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఫౌచీ అమెరికాలో కొవిడ్ కట్టడికి ట్రంప్ ఏర్పాటు చేసిన కార్యదళంలో కీలక సభ్యుడు.
తయారీలో జాప్యాన్ని ఇలా తగ్గించొచ్చు...
వ్యాక్సిన్ సమర్థతపై ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగాలు.. అనంతరం దాని తయారీ మధ్య జాప్యాన్ని తగ్గించేందుకు ఉన్న మార్గాలను ఫౌచీ ఈ సందర్భంగా సూచించారు. వ్యాక్సిన్ ఆమోదానికి ఉన్న నియంత్రణా ప్రమాణాలు-సమీక్షలు; వ్యాక్సిన్ పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సమాచారాన్ని పెంపొందించడం-దాన్ని సమన్వయపరచడం; మరింత సమర్థమైన వ్యాక్సిన్ ఉత్పత్తికి నిధులు సమకూర్చడం- ఈ అంశాల్లో కాలయాపన జరగకుండా ఉంటే ప్రయోగ దశను దాటుకొని అత్యంత వేగంగా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని ఫౌచీ స్పష్టం చేశారు.