అఫ్గానిస్థాన్ విషయంలో భారత్ నిర్మాణాత్మక పాత్ర పోషించిందని అమెరికా భద్రతా విభాగం పెంటగాన్ తెలిపింది. శిక్షణ, మౌలిక వసతుల కల్పనలో భారత్ పాత్ర విశేషమైనదని పెంటగాన్ మీడియా ప్రతినిధి జాన్ కిర్బీ అభివర్ణించారు. అఫ్గాన్‌కు.. భారత్- అమెరికా సంయుక్త సహకారంపై ఈ విధంగా మాట్లాడారు. అఫ్గాన్‌లో స్థిరత్వం, సుస్థిర పరిపాలన కోసం భారత్ చేపట్టిన పనులు స్వాగతించదగ్గవని కిర్బీ అన్నారు.
అఫ్గాన్, పాకిస్థాన్ సరిహద్దుల మధ్య ఉన్న ప్రాంతాల సంరక్షణ కోసం పాక్ అధికారులతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు కిర్బీ తెలిపారు.
"తాలిబాన్ ఉగ్రకార్యకలాపాలకు పాకిస్థాన్ కూడా ఓ బాధిత దేశంగా మారే అవకాశముంది. దీని వల్ల పాక్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తొచ్చు. అందుకే తాలిబాన్ ఉగ్ర చర్యలను కట్టడి చేసే అంశమై పాక్ అధికారులతో మాట్లాడుతున్నాం."
--కిర్బీ, పెంటగాన్ మీడియా ప్రతినిధి.