కరోనా మహమ్మారి దేశ వైద్య సేవలపై తీవ్రమైన ప్రభావం చూపిన కారణంగా.. భారత్లో ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. గర్భిణీ మరణాలు సైతం పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ఆరు దక్షిణాసియా దేశాల్లో ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాల సంఖ్య 2020లో 2,28,641గా నమోదయ్యే అవకాశం ఉందని ఐరాస తన నివేదికలో పేర్కొంది. భారత్లో ఈ మరణాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 15 శాతం పెరిగి 1,54,020కి చేరుకుంటాయని అంచనా వేసింది. పాకిస్థాన్లో చిన్నారుల మరణాలు 14 శాతం అధికమై 59,251కి పెరుగుతాయని వెల్లడించింది.
'దక్షిణాసియాలో కరోనా మహమ్మారి ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలు' అనే పేరుతో యునిసెఫ్, డబ్ల్యూహెచ్ఓ, ఐరాస జనాభా నిధి(యూఎన్ఎఫ్పీఏ) సంయుక్తంగా ఈ నివేదిక రూపొందించాయి. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భారత్, నేపాల్, శ్రీలంక దేశాల గణాంకాలతో ఈ నివేదిక తయారు చేశాయి.
ఇదీ చదవండి:
గర్భస్రావాలు-గర్భిణీ మరణాలు
దక్షిణాసియా దేశాల మహిళల్లో గర్భస్రావాలు కూడా పెరుగుతాయని నివేదిక హెచ్చరించింది. ఆరుదేశాల్లో 89,434 గర్భస్రావాలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ఇందులో ఎక్కువ భాగం భారత్(60,179- 10 శాతం పెరుగుదల), పాకిస్థాన్(39,752- 11 శాతం పెరుగుదల), బంగ్లాదేశ్(5,502-3 శాతం పెరుగుదల)లోనే నమోదవుతాయని అంచనా వేసింది.
గర్భిణీ మరణాలు భారత్లో 18 శాతం పెరిగి 7,750గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. సరైన గర్భనిరోధక పద్దతులను పాటించకపోవడం వల్ల 35 లక్షల అవాంఛిత గర్భాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇందులోనూ భారత్ వాటానే అధికమని స్పష్టం చేసింది.
కరోనా కేసులు- ఖర్చులు అధికం
2021 ఫిబ్రవరి నాటికి దక్షిణాసియాలో 12 మిలియన్ల కరోనా కేసులు వెలుగులోకి వస్తే.. అందులో 10.9 మిలియన్ కేసులు భారత్లోనే ఉన్నాయని నివేదిక తెలిపింది. కరోనా వల్ల ఈ ప్రాంతంలోని దేశాలకు 2.4 బిలియన్ డాలర్ల వ్యయం అయిందని నివేదిక పేర్కొంది. ఇందులో టెస్టింగ్ కోసం 1.9 బిలియన్ డాలర్లు, వైద్యసేవల వినియోగానికి 581 మిలియన్ డాలర్లు ఖర్చు అయినట్లు తెలిపింది.
కరోనా నియంత్రణ చర్యల స్థాయిని బట్టి.. ఈ వ్యయం ఇలాగే కొనసాగితే 2021 సెప్టెంబర్ నాటికి.. దక్షిణాసియా దేశాలు 8.1 బిలియన్ డాలర్లను కరోనా టెస్టులపై ఖర్చు చేసే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. వైద్య సేవల వినియోగంపై 520 మిలియన్ డాలర్ల నుంచి 2.4 బిలియన్ డాలర్లను వ్యయం చేసే అవకాశం ఉందని లెక్కగట్టింది. ఇందులో అధిక వాటా భారత దేశానిదేనని నివేదిక స్పష్టం చేసింది. 7.8 బిలియన్ డాలర్లను టెస్టింగ్ కోసం, 1.7 బిలియన్ డాలర్లను వైద్య సేవల వినియోగం కోసం భారత్ ఖర్చు చేస్తుందని అంచనా వేసింది.