భారత్, అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరు దేశాలు ప్రాధాన్య క్రమంలో చర్యలు చేపట్టాలని ట్రంప్ పరిపాలన విభాగంలోని మాజీ అధికారి ఒకరు తన నివేదికలో వెల్లడించారు. మేధో సంపత్తి హక్కులు, డిజిటల్ వాణిజ్యం వంటి విభాగాల్లో సహాయసహకారాలు అవసరమని నివేదించారు.
దక్షిణ, కేంద్ర ఆసియా వ్యవహారాలకు అమెరికా వాణిజ్య ప్రతినిధిగా సేవలందించిన మాజీ అధికారి మార్క్ లిన్స్కాట్ 'ట్రేడ్ అట్ ఏ క్రాస్‌రోడ్స్: ఏ విజన్ ఫర్ ద యూఎస్-ఇండియా ట్రేడ్ రిలేషన్షిప్' పేరిట నివేదిక రూపొందించారు. ఈ నివేదికను అట్లాంటిక్ కౌన్సిల్, అమెరికా-భారత వ్యూహాత్మక భాగస్వామ్య వేదికలో (యూఎస్ఐఎస్పీఎఫ్)లో సమర్పించారు.
అమెరికా ప్రతినిధులు భారత్‌తో చర్చల అనంతరం స్వదేశానికి తిరిగి వెళ్లిన కొద్ది రోజులకే ఈ నివేదిక విడుదల చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ నివేదికలో భారత్-అమెరికాల మధ్య సంబంధాలు, ఇటీవలి చర్చలు, స్వల్ప, మధ్యస్థ, దీర్ఘకాలికంగా అంశాలపై పలు కీలక సూచనలు చేశారు.