కరోనా సంక్షోభం నెలకొన్న వేళ... సౌర విద్యుత్ వేలం మంచి ఆదరణ పొందింది అనడానికి భారత్ ఓ మంచి ఉదారహణగా నిలిచిందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు.
"ఇప్పుడిప్పుడే మార్పునకు బీజాలు పడుతున్నాయి. పునరుత్పాదక శక్తి ఒక్కటే 2020లో వృద్ధి చెందగల ఏకైక ఇంధన వనరు. కరోనా సంక్షోభం వేళ సౌర విద్యుత్ వేలం మంచి ఆదరణ పొందింది. దీనికి భారత్ ఓ మంచి ఉదాహరణ. పునరుత్పాదక శక్తి వనరులు... సంప్రదాయ శిలాజ ఇంధనాల వనరుల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించగలవు."
- ఆంటోనియో గుటెరస్, ఐరాస ప్రధాన కార్యదర్శి
అంతర్జాతీయ ఇంధన సంస్థ క్లీన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ సమ్మిట్లో... గుటెరస్ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బొగ్గు ఆధారిత ఇంధన ఉత్పత్తికి... ఫైనాన్స్ చేయడం ఆపాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు.
"కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కే ప్రణాళికలో బొగ్గుకు స్థానం లేదు. 2050 నాటికి కర్బన ఉద్గారాలను నికరంగా సున్నా స్థాయికి తీసుకొచ్చేందుకు ప్రపంచ దేశాలు కట్టుబడి ఉండాలి. వచ్చే ఏడాది నిర్వహించే సీఓపీ-26 కంటే ముందు... మరింత మంచి జాతీయ వాతావరణ ప్రణాళికను రూపొందించాల్సి ఉంది."
- ఆంటోనియో గుటెరస్, ఐరాస ప్రధాన కార్యదర్శి