ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలు విస్మరించడం వల్లే అంతర్జాతీయ సంస్థల్లో అసమానతలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఆరోపించారు. ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల ఏర్పడిన పరిస్థితులు ఇదే విషయాన్ని తేటతెల్లం చేసినట్లు ఆయన అభిప్రాయపడ్డారు. వీటిని అధిగమించి మరింత సమాన, సుస్థిర ప్రపంచాన్ని నెలకొల్పడానికి తాజా పరిస్థితులు మరో అవకాశం కల్పించాయని ప్రపంచదేశాలకు సూచించారు. నెల్సన్ మండేలా ఫౌండేషన్ వార్షికోత్సవంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు.
"ప్రస్తుతం ప్రపంచదేశాలన్ని ఒకే సముద్రంలో తేలియాడుతున్నప్పుడు కొందరు పడవల ద్వారా గట్టున చేరుతుండగా, మరికొన్ని దేశాలు మాత్రం శిథిలాల్లో చిక్కుకుపోతున్నట్లు బయటపడింది. మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో అన్నిదేశాలు ఒకే పడవపై ప్రయాణిస్తున్నాయని అనుకోవడం ఒక భ్రమే. ఇలాంటి సమయంలో అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలను ఆదుకోవడంలో ధనిక దేశాలు విఫలమయ్యాయి"
- ఆంటోనియో గుటెర్రస్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్
'అంతేకాకుండా అంతర్జాతీయ సంస్థల్లో అవసరమైన సంస్కరణలు చేపట్టడానికి కొన్ని దేశాలు నిరాకరిస్తూనే ఉన్నాయి. ఏడు దశాబ్దాలుగా ఇది కొనసాగుతోంది. ఐరాస భద్రతా మండలిలో ఓటింగ్ హక్కులు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల్లో బ్రెటన్ వూడ్స్ విధానాలు దీనికి ప్రత్యక్ష ఉదహరణలు' అని గుటెర్రస్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి అంతర్జాతీయ సంస్థల్లో అసమానతల స్థాయి పెరిగిపోయిన నేపథ్యంలో వీటిని సంస్కరించడం మొదటిపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని సూచించారు.
భవిష్యత్తులో పొంచివున్న ప్రమాదాలను దశాబ్దాల కాలంగా విస్మరించడం వల్లే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన అన్నారు. ఇలాంటి సమయంలో ఆరోపణలు, వైరుద్ధ్యాలు, అసమానతలకు లొంగిపోదామా? లేదా ప్రపంచ శ్రేయస్సు కోసం గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకొని కలిసి ముందుకు వెళ్దామా?అనే విషయాన్ని ప్రపంచనాయకులు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి:'ఆ రాష్ట్రాల్లో ట్రంప్ భవితను తేల్చేది ఎన్ఆర్ఐలే!'