తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఆ దాడి చేసింది నా మద్దతుదారులు కాదు' - క్యాపిటల్​ దాడిని ఖండించిన ట్రంప్​

అమెరికా క్యాపిటల్​ భవనంపై జరిగిన దాడిని మరోమారు ఖండించారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. క్యాపిటల్ హిల్ దాడిలో పాల్గొన్న వారు ఎవరూ తన మద్దతుదారులు కాలేరని, అమెరికా చట్టాలకు, జాతీయ పతాకానికి చేటు చేసిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ మేరకు ఓవల్​ కార్యాలయం ఓ వీడియోను విడుదల చేసింది.

Donald trump
అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్

By

Published : Jan 14, 2021, 8:45 AM IST

క్యాపిటల్‌ హిల్‌ దాడి ఘటనను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓవల్ ఆఫీస్ ఒక వీడియోని విడుదల చేసింది. గతేడాది ఎన్నో రాజకీయ ప్రేరేపిత హింసల్ని అమెరికా చవిచూసిందని పేర్కొన్నారు ట్రంప్​. హింస ఎప్పటికీ సమర్థనీయం కాదన్నారు. కొవిడ్‌-19 కారణంగా సమర్థంగా అడ్డుకోలేక పోయామని చెప్పారు. క్యాపిటల్ హిల్ దాడిలో పాల్గొన్న వారు ఎవరూ తన మద్దతుదారులు కాలేరని, అమెరికా చట్టాలకు, అమెరికా జాతీయ పతాకానికి చేటు చేసిన వారు తప్పనిసరిగా మూల్యం చెల్లించుకొని తీరుతారని అన్నారు.

" గతవారం జరిగిన విధ్వంసాన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నా. హింస, విధ్వంసాలకు మన దేశం(అమెరికా)లో చోటు లేదు. మన ఉద్యమంలో కూడా వాటికి స్థానం లేదు. అమెరికాను తిరిగి అత్యున్నతస్థానంలో నిలపాలన్న మన ఉద్యమం చట్టాలను గౌరవిస్తూ మాత్రమే సాగుతుంది. ప్రతిఒక్కరూ శాంతిభద్రతలు పరిరక్షిస్తున్న మన బలగాలకు మద్దతుగా నిలవండి. అత్యున్నతమైన అమెరికా సంప్రదాయాలు, విలువలను నిలబెట్టండి. నా నిజమైన మద్దతుదారులు ఎన్నటికీ రాజకీయ ప్రేరేపిత హింసకు పాల్పడరు. శాంతిభద్రతలు పరిరక్షించే బలగాలకు వ్యతిరేకంగా వ్యవహరించరు. మన జాతీయ పతాన్ని అవమానించరు. గతేడాది కొవిడ్- 19 కారణంగా దేశవ్యాప్తంగా అదుపుతప్పిన రాజకీయ హింసను మనం నిలువరించలేక పోయాము. చాలా దొమ్మీలు, హింసాత్మక ఘటనలు, విధ్వంసాలు చూశాం. ఇవన్ని నిలిపేయాలి. మీరు అతివాదులైనా, వామపక్షవాదులైనా, డెమోక్రాట్లైనా, రిపబ్లికన్లైనా హింసను మాత్రం సమర్థించుకోవడం సాధ్యం కాదు. ఏ విధమైన మన్నింపులు, మినహాయింపులు ఉండబోవు. అమెరికా ఓ చట్టబద్ధమైన దేశం. తప్పుచేసిన ప్రతిఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదు."

- డొనాల్డ్ ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడు

ఇదీ చూడండి:మరో అపఖ్యాతిని మూటగట్టుకున్న ట్రంప్​

ABOUT THE AUTHOR

...view details