అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏది చేసినా ప్రత్యేకమే. శ్వేతసౌధం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ తన మార్క్ చూపిస్తారు. ఇటీవల తాలిబన్లతో శాంతి ఒప్పందం కుదుర్చుకుని తనకు సాటెవ్వరూ లేరని నిరూపించుకున్నారు. తాజాగా తాలిబన్ నాయకుడు ముల్లాహ్ అబ్దుల్ ఘనీతో ఫోన్లో మాట్లాడి ప్రపంచ దేశాలను అశ్చర్యానికి గురిచేశారు.
ఓ తాలిబన్ నాయకుడితో ఫోన్లో మాట్లాడిన మొదటి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర సృష్టించారు. అఫ్గాన్‌లో శాంతిని నెలకొల్పే విషయంపై ముల్లాహ్తో ట్రంప్ చర్చించినట్లు శ్వేతసౌధం తెలిపింది.
ఫిబ్రవరి 29న అమెరికా-తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం కుదరగా.. ఆ మరుసటి రోజే ఈ చారిత్రక ఫోన్ సంభాషణ జరిగినట్లు శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. మార్చి 10న అఫ్గాన్ ప్రభుత్వం-తాలిబన్ల మధ్య అంతర్గత చర్చలు జరగనున్నాయి.