అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా అధినేతలతో ఫోన్ సంభాషణ జరిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సురక్షిత, సుసంపన్న వాతావరణాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యొషిహిదె సుగా, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో బుధవారం ఫోన్లో మాట్లాడారు బైడెన్. అధ్యక్ష ఎన్నికల్లో ఘన విషయం సాధించిన బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయా దేశాధినేతలు చేసిన ఈ ఫోన్ కాల్స్‌లో వారి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చాయి.
ఆస్ట్రేలియాతో సత్సంబంధాలు..
ఆస్ట్రేలియాతో అమెరికాకు చాలా కాలంగా సత్సంబంధాలున్నట్లు బైడెన్ స్కాట్ మోరిసన్‌తో చెప్పుకొచ్చారు. మొదటి ప్రపంచ యుద్ధం నుంచి ఇరు దేశాలు కలిసి పోరాటం చేస్తున్నాయని గుర్తు చేశారు. కొవిడ్ 19 సహా ఆరోగ్య సంబంధిత ఇతర సవాళ్లను ఎదుర్కొనే విషయంలో మోరిసన్‌తో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు బైడెన్.