తెలంగాణ

telangana

ETV Bharat / international

'ట్రంప్‌ ట్వీట్లు నిజమో కాదో తెలుసుకోండి' - ట్రంప్ తాజా వార్తలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ట్వీట్లకు తొలిసారి ట్విట్టర్‌ 'ఫ్యాక్ట్‌ చెక్‌' హెచ్చరికను జారీ చేసింది. ఎన్నికల్లో 'మెయిల్‌-ఇన్‌-బ్యాలెట్‌' అవలంబించడం ద్వారా మోసం జరిగే అవకాశం ఉందని ట్రంప్‌ చేసిన ఆరోపణల్లో నిజమెంతో తెలుసుకోవాలని ట్విట్టర్‌... నెటిజన్లకు సూచించింది. ఇలా ఆయన చేసిన రెండు ట్వీట్లలో 'ఫ్యాక్ట్‌ చెక్‌' హెచ్చరికను ఉంచింది.

Trump tweets
ట్రంప్‌ ట్వీట్లు

By

Published : May 27, 2020, 9:54 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లకు నిజ నిర్ధరణ (ఫ్యాక్ట్ చెక్) హెచ్చరికలు జత చేసింది ట్విట్టర్. 'మెయిల్​- ఇన్​ బ్యాలట్స్​'తో మోసం జరిగే అవకాశం ఉందని ట్రంప్ చేసిన రెండు ట్వీట్లలో నిజమెంతో తెలుసుకోవాలని వినియోగదారులకు సూచించింది.

ఈ ట్వీట్ల కింద 'గెట్​ ది ఫ్యాక్ట్ చెక్​ ఎబౌట్​ మెయిల్​- ఇన్ బ్యాలట్స్​' అనే లింక్​ను పెట్టింది ట్విట్టర్​. దీనికి క్లిక్ చేస్తే ట్రంప్ చేసిన ఆరోపణలకు సంబంధించి వాస్తవాలను అందిస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి వార్తా కథనాలను జోడించింది.

ట్రంప్ ట్వీట్లకు ట్విట్టర్ ఫ్యాక్ట్ చెక్​

ఇలా ట్రంప్ చేసిన ట్వీట్లకు ఫ్యాక్ట్ చెక్​ చేయటం ఇదే తొలిసారి. ఇన్నాళ్లుగా సాధారణ ఖాతాదారుల విషయంలో పాటించే నిబంధనలనుంచి ట్రంప్​ను మినహాయించింది ట్విట్టర్​. కానీ తాజా చర్యలతో చర్చనీయాంశమైంది. తరచూ తప్పుడు సమాచారం అందించటం, తనకు నచ్చనివారిని లక్ష్యంగా చేసుకుని నిందించటం చేస్తున్నారని ఈ హెచ్చరిక ద్వారా ట్విట్టర్ పరోక్షంగా తెలియజేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ట్రంప్ ఆగ్రహం..

ఇలా తన ట్వీట్లకు ఫ్యాక్ట్​ చెక్​ ట్యాగ్ జతచేయటంపై ట్రంప్ స్పందించారు. అమెరికా ఎన్నికల్లో ట్విట్టర్​ జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. "నకిలీ వార్తలు చెప్పే సీఎన్​ఎన్​, వాషింగ్టన్ పోస్ట్​ కథనాల ఆధారంగా నా ట్వీట్లను తప్పు అని చెబుతోందని" ట్రంప్ ఎద్దేవా చేశారు. ట్విట్టర్​ చర్యలను తాను ఆమోదించనని స్పష్టం చేశారు.

ట్విట్టర్​పై ట్రంప్ ఆగ్రహం

ఇదీ జరిగింది..

నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో 'మెయిల్‌-ఇన్‌-బ్యాలెట్‌' విధానాన్ని అవలంబించాలని కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసోమ్‌ నిర్ణయించారు. ఇందుకోసం నమోదు చేసుకున్న ఓటర్లకు ఇప్పటి నుంచే బ్యాలెట్‌ పేపర్లు పంపాలని ఆదేశించారు. దీన్ని ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. 'మెయిల్‌-ఇన్‌-బ్యాలెట్​' విధానంలో మోసం జరిగే అవకాశం ఉందని ఆరోపించారు.

''మెయిల్‌-ఇన్‌-బ్యాలెట్స్‌ పెద్ద మోసం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ మెయిల్‌ బాక్స్‌లను దొంగిలించొచ్చు. బ్యాలెట్లను ఫోర్జరీ చేయొచ్చు. అక్రమంగా ముద్రించొచ్చు. దొంగ సంతకాలూ చేయొచ్చు. కాలిఫోర్నియా గవర్నర్‌ లక్షలాది మందికి బ్యాలెట్లను పంపుతున్నారు. వారెవరు.. ఎక్కడి నుంచి వచ్చారో కూడా చూడకుండా అందరికీ పంచేస్తున్నారు. ఇప్పటి వరకు ఓటు వేయనివారు.. వేస్తామని కూడా అనుకోనివారు.. ఎవరికి వేయాలో కూడా తెలియనివారందరూ ఓటు వేయబోతున్నారు. అలా జరిగితే అది రిగ్గింగే.'' అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు ట్రంప్.

మెయిల్‌-ఇన్‌-బ్యాలెట్‌ అంటే..

పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేసే వెసులుబాటు లేనివారు ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే, దీని కోసం ముందుగానే నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద గుమిగూడడం ఏమాత్రం సురక్షితం కాదని భావిస్తున్న అనేక మంది ఈ విధానం వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ పద్ధతిలో బ్యాలెట్‌ పేపర్‌ను అత్యంత భద్రతతో ఇంటికి ఓ ఎన్వెలప్‌లో పంపుతారు. నచ్చిన అభ్యర్థి కాలమ్‌ వద్ద మార్క్‌ చేయాలి. తిరిగి అత్యంత భద్రత నడుమ, ప్రమాణాల ప్రకారం ఎన్వెలప్‌లో పెట్టాలి.

దాన్ని దగ్గర్లో ఏర్పాటు చేసిన మెయిల్‌ బాక్స్‌లోగానీ, పోలింగ్‌ కేంద్రం వద్ద ఇవ్వాలి. అయితే, ఈ ప్రక్రియలో అత్యంత భద్రతా ప్రమాణాలను పాటిస్తారు. ఫోర్జరీ జరగకుండా ఆన్‌లైన్‌లో నమోదైన సంతకంతో ఎన్వెలప్‌పై చేసిన సంతకం సరిపోలడం, రెండోసారి ఓటు వేసే అవకాశం లేకుండా బార్‌కోడ్‌ విధానాన్ని అవలంబించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు.

ABOUT THE AUTHOR

...view details