అమెరికా వార్షిక రక్షణ విధాన బిల్లుపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయోగించిన వీటో అస్త్రం ఫలించలేదు. ట్రంప్ వీటోను అమెరికా కాంగ్రెస్ ధిక్కరించింది. ట్రంప్ నాలుగేళ్ల పాలనలో ఈ విధంగా జరగడం ఇదే తొలిసారి.
ట్రంప్ వీటోను ధిక్కరించాలంటే ఈ బిల్లును కాంగ్రెస్‌లోని ఉభయసభలు మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది. అయితే రిపబ్లికన్ల చేతిలో ఉన్న సెనేట్.. ట్రంప్ వీటోను సునాయాసంగా పక్కనపెట్టింది. 81-13 ఓట్ల తేడాతో వీటోను తిరగరాసింది సెనేట్. ప్రతినిధుల సభ ఇప్పటికే 322-87తో ట్రంప్ వీటోను రద్దు చేసింది. బిల్లు ద్వారా అమెరికా దళాల జీతాల్లో అదనంగా 3శాతం పెరగనుంది. దీనితో పాటు రక్షణ విధానాలు, సైన్యం సన్నద్ధత, నూతన ఆయుధ వ్యవస్థ, సిబ్బంది విధానాలు ఇతర మిలిటరీ లక్ష్యాలకు మార్గదర్శకంగా ఈ బిల్లును రూపొందించారు.