క్యాపిటల్ భవనంపై దాడికి తమ మద్దతుదారులను ప్రేరేపించారన్న ఆరోపణలతో రెండోసారి అభిశంసన ఎదుర్కొన్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కానీ, సెనేట్‌లో ఓటింగ్ నిర్వహించగా నిర్దోషిగా బయటపడ్డారు. అయితే.. క్యాపిటల్ అల్లర్లకు ట్రంప్‌ను బాధ్యుడిగా చేసేందుకు అభిశంసన తుది ప్రక్రియ కాదని, తదుపరి చర్యలు కోర్టుల్లో ఎదుర్కోవలసి వస్తుందని పలువురు రిపబ్లికన్లు, న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ఒక సాధారణ పౌరుడిగా ఉన్న ట్రంప్.. అధ్యక్ష పదవి నుంచి అందే న్యాయపరమైన భద్రతకు దూరమయ్యారు. హోదాలో మార్పుతో జనవరి 6 దాడిని ప్రేరేపించిన విచారణలో నిర్దోషిగా తేల్చిన రిపబ్లికన్లు కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. అభిశంసన నుంచి మరింత ముందుకు సాగాలని అమెరికా ప్రజలను కోరే అవకాశం లేకపోలేదని వాదనలు వినిపిస్తున్నాయి.
"అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రతిదానికీ ట్రంప్ ఇప్పటికీ బాధ్యుడే. మాజీ అధ్యక్షుడిని బాధ్యుడిగా చేసేందుకు సెనేట్ కన్నా కోర్టులు సరైన వేదికలు. ఇప్పటికీ దేని నుంచీ ఆయన బయటపడ లేదు. "
- మిచ్ మెక్కొన్నెల్, సెనేట్ మైనారిటీ నేత
అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ట్రంప్‌పై వచ్చిన పలు అభియోగాల్లో క్యాపిటల్ దాడి ఒకటి. ఇప్పటికే ఎన్నికల అధికారులపై ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలతో జార్జియాలో విచారణ ఎదుర్కొంటున్నారు. మన్హట్టన్లో అక్రమ లావాదేవీలు, వ్యాపార ఒప్పందాల వంటి కేసులు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఆయన చర్యల్లో నష్టపోయిన బాధితులు కూడా కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. క్యాపిటల్ అల్లర్లను ప్రేరేపించినట్లు ట్రంప్‌ను దోషిగా తేల్చేందుకు ఏ విధంగానూ స్పష్టమైన అవకాశాలు కనిపించటం లేదు.
మరోవైపు.. సరైన క్రిమినల్ దర్యాప్తునకు చాలా సమయం పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఫెడరల్ కేసులు తీసుకొచ్చేందుకు కనీసం ఐదేళ్లు పడుతుందంటున్నారు. క్యాపిటల్ దాడి ఘటనలో ప్రతి రోజు కొత్త ఆధారాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే 200 మందికిపైగా అరెస్ట్ చేశారు పోలీసులు. దాడి చేపట్టాలని ట్రంప్ మమ్మల్ని ఆదేశించారని అందులో కొందరు చెబుతున్నారు. ఇవన్నీ ఆధారాలుగా ఉపయోగపడనున్నాయని న్యాయనిపుణలు పేర్కొంటున్నారు.
ఇదీ చూడండి:చెక్కుచెదరని ఆధిపత్యం- దటీజ్ 'ట్రంపిజం'!
'భయంతోనే ట్రంప్‌కు అనుకూలంగా ఓటు'