శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బాగుంటే కరోనాను జయించినట్టే. ఈ వ్యవస్థ తగినంతగా లేకుంటే అలాంటివారికి యాంటీబాడీలు ఇచ్చి రోగ నిరోధక శక్తి పెంచుతుంటారు. ఒకవేళ యాంటీబాడీలు ఇచ్చినా సరిపోకపోతే ఏం చేయాలి? దీనిపై అమెరికాలోని బేత్ ఇజ్రాయెల్ డియకోనెస్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. తెల్లరక్త కణాల్లో ఉండే 'టి' కణాల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచవచ్చని నిర్ధరించారు. తొలుత కోతులపై ప్రయోగాలు చేసి దీనిని రుజువు చేశారు.
'టి' కణాలతో రోగ నిరోధక శక్తి పెంపు - టి కణాలు
శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గితే.. యాంటీబాడీల సాయంతో మళ్లీ పెంచుతుంటారు. ఒకవేళ ఆ యాంటీబాడీలు కూడా సరిపోకపోతే ఏం చేయాలి? దీనిపై పరిశోధన జరిపిన అమెరికా శాస్త్రవేత్తలు ఓ కొత్త విధానాన్ని కనిపెట్టారు.
తొలి తరం కరోనా టీకాల తయారీ జరుగుతుండగా, రెండో తరం టీకాల రూపకల్పనలో ఈ ప్రయోగం ఉపకరిస్తుందని పరిశోధనకు ఆధ్వర్యం వహించిన ప్రొఫెసర్ డాన్ బరౌచ్ తెలిపారు. యాంటీబాడీలు ఆధారంగా చేసే చికిత్సల విషయంలోనూ దీన్ని ఉపయోగించకోవచ్చని చెప్పారు. యాంటీబాడీలు, 'టి' కణాల పనితీరును నిశితంగా పరిశీలించామని తెలిపారు. యాంటీబాడీల స్థాయి తగ్గినప్పుడు 'టి' కణాలు వాటి లోటును భర్తీ చేస్తాయని చెప్పారు. అలాంటప్పుడు 'టి' కణాలపై ప్రభావం చూపే వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. కొత్తగా మందులు తయారు చేసినప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని అన్నారు.