భారత్, అమెరికా దేశాల మధ్య అధ్యక్ష ఎన్నికలకు ముందే చిన్నస్థాయి వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం లేకపోలేదని మాజీ దౌత్యవేత్త, అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్ఐబిసీ) అధ్యక్షురాలు నిషా బిస్వాల్ పేర్కొన్నారు. ఈటీవీ భారత్ ముఖాముఖిలో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ స్మితా శర్మతో మాట్లాడిన నిషా... ట్రంప్ వలస విధానాలపై విమర్శలు చేశారు. హెచ్1బీ, ఎల్1 వీసాలు నిలిపివేయడం, ఎఫ్1 వీసాదారులైన విదేశీ విద్యార్థులను అమెరికా విడిచి వెళ్లాలనే ఆదేశాలను తప్పుబట్టారు. వలసదారులపై వేటు వేయడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ నష్టపోతుందని అన్నారు.
ఒబామా హయాంలో విదేశాంగ(దక్షిణ మధ్యాసియా విభాగం) సహాయ మంత్రిగా పనిచేశారు బిస్వాల్. భారత్‌లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని గూగుల్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. కొవిడ్ ప్రభావం తర్వాత డిజిటల్ ఆర్థిక వ్యవస్థదే భవిష్యత్తు అని పేర్కొన్నారు. ఇండో-అమెరికా వాణిజ్య సంబంధాలు రాబోయే ఏళ్లలో మరింత బలపడతాయని పేర్కొన్నారు. అయితే భారత్‌లో స్థిరమైన విధానపర ఫ్రేమ్‌వర్క్ రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారయ్యే అవకాశం ఉందా?
అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి రాబర్ట్ లైట్‌హైజర్, భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ బృందాల మధ్య జరుగుతున్న విస్తృతమైన చర్చల్లో మినీ వాణిజ్య ఒప్పందం ఒకటి. సమస్యలు ఏవైనా ఉంటే వాటిని అధిగమించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఇది పూర్తయ్యే అవకాశాలు తక్కువగా మారే అవకాశం ఉంది. అయితే ఇరు దేశాలు వీలైనంత త్వరగా ఒప్పందాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికలకు ముందే ఇది జరిగితే నేను ఆనందంగా ఆశ్యర్చపోతాను.
అమెరికా- చైనా మధ్య వాణిజ్య విభేదాలు, భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా-భారత్ మధ్య ఉన్న వాణిజ్య అవకాశాలేంటి?
భారత్‌లో సప్లై చైన్, తయారీ రంగంపై ప్రత్యేక దృష్టికోణంతో ఇరుదేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఔషధాలు, అధునాతన సాంకేతికత, మౌలిక వసతుల కల్పన, రక్షణ రంగాల్లో భాగస్వామ్యం దృఢపర్చుకోవాలి.
భారత్, అమెరికాకు చైనా ఎప్పుడూ చాలా ముఖ్యమైన ఆర్థిక భాగస్వామిగానే ఉంటుంది. దీన్ని ఎవరూ మార్చలేరు. అయితే సప్లై చైన్‌లో వైవిధ్యం సహా కొన్ని రంగాల్లో ముప్పును తగ్గించుకోవడానికి భారత్‌లో స్థిరమైన, పెట్టుబడిదారులకు అనుకూలమైన ఫ్రేమ్‌వర్క్ రూపొందించాల్సిన అవసరం ఉంది. కానీ ఇది దీర్ఘకాలంలో జరగాల్సిన విషయం. ప్రస్తుతం చాలా కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. భారీ పెట్టుబడులకు ఇది సమయం కాదు.
గల్వాన్ ఘర్షణ తర్వాత కొన్ని చైనా వస్తువుల దిగుమతిపై భారత్ నిషేధం విధించడం వల్ల గందరగోళం తలెత్తింది. దీని వల్ల అమెరికా తయారీ సంస్థలు సైతం నష్టపోతాయని అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనిపై మీరేమంటారు?