50 బిలియన్ డాలర్లతో ప్రపంచ వ్యాక్సినేషన్ ప్రణాళికను అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ప్రతిపాదించింది. దాని వల్ల 2021 చివరి నాటికి 40 శాతం ప్రపంచ జనాభాకు వ్యాక్సిన్ అందుతుందని చెప్పింది. 2022 మొదటి అర్ధభాగం నాటికి 60 శాతం మందికి టీకా అందుతుందని పేర్కొంది. ఈ మేరకు జీ20 ఆరోగ్య సదస్సులో ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా పేర్కన్నారు.
"భారీ ఆర్థిక సాయం, బలమైన సహకార చర్యల ద్వారా ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచం బయటపడగలదు. కొంతకాలంగా భయంకరమైన ఆర్థిక అసమానతలను ఎదుర్కొంటున్నాం. వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్న దేశాలకు, లేని పేద దేశాలకు మధ్య అంతరం పెరిగే కొద్దీ అసమానత మరింత తీవ్రమవుతుంది."
-క్రిస్టాలినా జార్జివా, ఐఎంఎఫ్ ఎండీ
డబ్ల్యూహెచ్‌ఓ, ప్రపంచ బ్యాంక్, గవి, ఆఫ్రికన్ యూనియన్ సహా ఇతర సంస్థల లక్ష్యాలు నెరవేరాలని క్రిస్టాలినా అన్నారు. ఇందుకు మూడు ఆచరణాత్మక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అందులో మొదటగా.. 2021 చివరినాటికి 40 శాతం మందికి, 2022 అర్ధభాగం నాటికి 60 శాతం మందికి టీకా వేయాలని చెప్పారు. ఇందుకోసం కొవాక్స్ కార్యక్రమానికి నిధులను సమకూర్చాలని.. దేశాల మధ్య ముడిపదార్థాలు, వ్యాక్సిన్ల రవాణా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని పేర్కొన్నారు.