ముందు రోజు రాత్రి నుంచి కాస్త జలుబు, గొంతు నొప్పి ఉన్నాయి అనుకోండి.. వెంటనే మనము అది కరోనా ఏమో అన్న అనుమానం వచ్చి పరీక్షలు చేయించుకుంటాం. గత ఏడాదిగా ఇదే పరిస్థితి. అయితే ఇప్పుడు వ్యాక్సినేషన్ విస్తృతం అయింది. చాలా మంది పూర్తిస్థాయిలో టీకాలు తీసుకున్నారు కూడా. రెండు డోసులు తీసుకున్నాక కూడా లక్షణాలు కనిపిస్తే కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలా అనే అనుమానం చాలా మందిలో వ్యక్తం అవుతోంది.
ఈ సందేహాలకు పశ్చిమ వర్జీనియా యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆరిఫ్ ఆర్ సార్వరీ సమాధానమిచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్నా సరే లక్షణాలు ఉంటే కొవిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
వ్యాక్సిన్లు 100 శాతం ప్రభావితం కావు.. ఎందుకంటే?
ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు కరోనాతో ఆసుపత్రి పాలవడం, చనిపోవడం మొదలైన వాటి నుంచి మాత్రమే రక్షణ కల్పిస్తాయని సార్వరీ వెల్లడించారు.
- ఫైజర్, మోడెర్నా తయారు చేసిన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు ఆసుపత్రి పాలవకుండా, చనిపోకుండా ఉండేలా 90 శాతం రక్షణ కల్పిస్తాయి. కానీ కరోనా సోకే అవకాశాలు ఉన్నాయి.
- కరోనా సోకకుండా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు 70 నుంచి 85 శాతం రక్షణ కల్పిస్తాయని ఇటీవల పరిశోధన వెల్లడించింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైరస్ సోకే అవకాశం ఉందా.. లేక పూర్తిస్థాయి రక్షణ ఉంటుందా అనే విషయంపై స్పష్టత లేదు.
- ఒకవేళ కరోనా సోకితే టీకా తీసుకున్న వారిపై ప్రభావం చూపకపోయిన.. వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి.
- ప్రస్తుతానికి వ్యాక్సిన్లు కొవిడ్ వేరియంట్లను కూడా ఎదుర్కొంటున్నాయి. కానీ భవిష్యత్తులో మరో కొత్త స్ట్రేయిన్ మ్యుటేట్ అయ్యి వ్యాక్సిన్లు కూడా పని చేయని సామర్థ్యానికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టీ లక్షణాలు ఉంటే పరీక్షలు చేసుకోవాల్సి అవసరం ఉందనడానికి ఇది మరో బలమైన కారణం.