అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా భారత్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ నెల 24న తన సతీమణి మెలానియాతో కలిసి బోయింగ్ 747-200బీ సిరీస్ విమానంలో దిల్లీకి రానున్నారు. 'ఎయిర్‌ఫోర్స్ వన్'గా పిలిచే ఈ విమానం ట్రంప్ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అమెరికా అధ్యక్షుడిని తీసుకెళ్లే ఈ విమానంలో ఎన్నో విశేషాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 'ఎగిరే శ్వేతసౌధమ'నే అనాలి.
ప్రతి విషయంలోనూ ప్రత్యేకత చాటుకునే అమెరికా.. దేశాధ్యక్షుడి విమానాన్ని కూడా అత్యంత అధునాతనంగా, వైభవంగా తీర్చిదిద్దింది. విమానంపై 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా' అక్షరాలు, అమెరికా జాతీయ జెండా, అధ్యక్షుడి ముద్రతో ఉండే ఎయిర్‌ఫోర్స్ వన్ తనదైన ప్రత్యేకత చాటుతోంది.
ప్రత్యేకతలివే..
ఇతర బోయింగ్ ప్యాసింజర్ విమానాల మాదిరిగా కాకుండా ఎయిర్‌ఫోర్స్ వన్‌కు గాల్లోనే ఇంధనం నింపుకొనే సామర్థ్యం ఉంది. అధ్యక్షుడు ఎక్కడికెళ్లాలంటే అక్కడకు తీసుకెళ్లే అపరిమిత రేంజ్ దీని సొంతం. అధునాతన సెక్యూర్ కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ దీని మరో ప్రత్యేకత. అంటే ఒకవేళ అమెరికాపై దాడులు జరిగితే ఆ సమయంలో ఈ విమానం మొబైల్ కమాండ్ సెంటర్‌గా పనిచేస్తుంది.