దక్షిణ భారతీయ వంటకాల్లో ఇడ్లీ-సాంబార్ అంటే తనకు చాలా ఇష్టమని డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ తెలిపారు. ఇన్స్టాగ్రామ్లో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. ఉత్తర భారత వంటకాల విషయానికి వస్తే టిక్కా వెరైటీలు ఏవైనా ఇష్టమేనని వెల్లడించారు.
ఇన్స్టా యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు కమల. ప్రచారాల్లో మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారన్న ప్రశ్నకు.. వ్యాయామం, పిల్లలతో మాట్లాడటం, వంట చేయటం ఇష్టపడతానని బదులు ఇచ్చారు.
- 2050 కల్లా కాలుష్య ఉద్గారాలను పూర్తిగా తగ్గించేందుకు తాను, అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కట్టుబడి ఉన్నామని హారిస్ తెలిపారు.
- "నాయకత్వం వహించడానికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు" అనేదే మహిళలకు తానిచ్చే సందేశమని చెప్పారు.
- చాలా చోట్ల ఒకటి, రెండు ఓట్లే ఫలితాన్ని నిర్దేశిస్తాయని కమల అన్నారు. మన జీవితంపై పడే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.