అఫ్గానిస్థాన్‌లో తలెత్తిన సంక్షోభానికి అమెరికా తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంతో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బైడెన్ తొలిసారి నోరు విప్పారు. శ్వేతసౌధంలో సోమవారం బైడెన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. అఫ్గాన్ నుంచి సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయం సరైందేనన్నారు. ఈ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటున్నట్లు పేర్కొన్నారు. అఫ్గాన్ నుంచి సైనికులను రప్పించడానికి సరైన సమయం అంటూ లేదని, 20 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని గ్రహించానని జో బైడెన్ పేర్కొన్నారు. అయితే అనుకున్నదానికంటే వేగంగా తాలిబన్లు అఫ్గాన్ ప్రభుత్వాన్ని పడగొట్టారని తెలిపారు. తన ముందు రెండు మార్గాలు ఉన్నాయని, ఈ ఏడాది అమెరికా దళాలను అఫ్గాన్ నుంచి వెనక్కి రప్పించడం లేదా మరిన్ని సైనిక దళాలను అఫ్గాన్‌కు పంపి మూడో దశాబ్దంలో కూడా యుద్ధాన్ని కొనసాగించడమే అని అన్నారు. అయితే గతంలో చేసిన తప్పులను తాను చేయకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయానికే తాను కట్టుబడతానన్నారు. ఈ నిర్ణయంపై చింతించడం లేదన్నారు. ఈ నిర్ణయం అమెరికాకు సరైందన్నారు. అమెరికాపై ఉగ్రదాడులను నిరోధించడమే మా లక్ష్యమని బైడెన్ తెలిపారు.
అఫ్గాన్ జాతి నిర్మాణం మా లక్ష్యం కాదు..
అమెరికా ప్రజలపై తాలిబన్లు దాడి చేస్తే తీవ్ర పరిస్థితులు ఉంటాయని బైడెన్ హెచ్చరించారు. మరో దేశ అంతర్యుద్ధంలో అమెరికా పోరాడాలని తాను సైనిక బలగాలకు చెప్పనన్నారు. తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని తెలుసన్నారు. అమెరికా చేస్తున్న సుదీర్ఘ యుద్ధంలో తాను నాలుగో అధ్యక్షుడినని, అయితే ఈ బలగాల ఉపసంహరణ పనిని ఐదో అధ్యక్షుడికి బదిలీ చేయదలుచుకోలేనన్నారు. 2009లో తాను అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అఫ్గాన్‌లో సైనిక దళాలను మోహరించడంపై వ్యతిరేకించినట్లు తెలిపారు. తాను అమెరికా ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకోవడంలేదన్నారు. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ సంబంధాలను నిర్మూలించడాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు బైడెన్ తెలిపారు. అంతేకాని అఫ్గాన్ జాతి నిర్మాణం చేయడం తమ లక్ష్యం కాదన్నారు. అఫ్గాన్ నుంచి అమెరికా దళాలు నిష్క్రమించినప్పటికీ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు. అమెరికా దళాలకు సహాయం చేసిన స్థానిక అఫ్గాన్ ప్రజలను త్వరలోనే అమెరికాకు తరలిస్తామని, వారిపై తాలిబన్లు దాడి చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు. కాబూల్ విమానాశ్రయంలో అఫ్గాన్ పౌరులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి విమానాల టైర్లపై ఎక్కి ప్రయాణించి మరణించారు. ఈ వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఈ సంఘటనపై బైడెన్ స్పందిస్తూ ఈ దృశ్యాలు నన్ను కలతపెట్టాయన్నారు.