తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెజాన్​ నది ప్రాంతాల్లో 'ఆపరేషన్​ మెర్​క్యూరీ'

పెరూ దేశంలోని అమెజాన్ పరివాహక ప్రాంతం బంగారం వేటతో పూర్తిగా కలుషితమైంది. తవ్వకాల కోసం వినియోగించిన పాదరసంతో పర్యావరణం దెబ్బతినడం కారణంగా చర్యలకు ఉపక్రమించింది ఆ దేశ ప్రభుత్వం. అక్రమ తవ్వకాలను అరికట్టి పర్యావరణ సమతుల్యతకు చర్యలు తీసుకుంటోంది.

By

Published : May 18, 2019, 9:03 AM IST

అమెజాన్​ నది ప్రాంతాల్లో 'ఆపరేషన్​ మెర్​క్యూరీ'

అమెజాన్​ నది ప్రాంతాల్లో 'ఆపరేషన్​ మెర్​క్యూరీ'

ప్రపంచంలోనే పరిమాణంలో అతిపెద్ద నది అమెజాన్. వివిధ రకాల పక్షి జాతులు, జంతుజాలం, అరుదైన మొక్కలకు ప్రసిద్ధి అమెజాన్ పరివాహక ప్రాంతం. ప్రపంచంలోని ఆరు దేశాలను తాకుతూ ఈ నది ప్రయాణిస్తోంది. అమెజాన్ భద్రతకు పెరూలో పెద్ద కష్టమే వచ్చి పడింది. నదీ ప్రాంతాల్లో బంగారం వేట నిత్యం కొనసాగుతూ ఉంటుంది. బంగారు పొడిని కనుగొని సంచుల్లో వేసుకునేంత వరకు అక్కడి వారి వేట ఆగదు.

తాంబోపాటా ప్రాంతం, లా పాంబాల్లో తరచుగా స్మగ్లర్లు అక్రమ తవ్వకాలు జరుపుతుంటారు. పోలీసులకు చిక్కుతూనే ఉంటారు. ముడి ఇసుక నుంచి బంగారాన్ని వేరు చేయడానికి పాదరసాన్ని ఉపయోగిస్తారు. టన్నుల కొద్దీ వినియోగించిన పాదరసం కారణంగా వేల సంఖ్యలో వృక్షాలు నేలకూలుతున్నాయి. నదులు విషమయం అవుతున్నాయి.

పెరూలోని అమెజాన్ పరివాహక ప్రాంతంలో అక్రమ తవ్వకాలు, మానవ అక్రమ రవాణా, ఇతర నేరాలను నియంత్రించేందుకు శాశ్వత సైన్య శిబిరాల​ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనికి 'ఆపరేషన్ మెర్​క్యూరీ'గా నామకరణం చేసింది. ఇటీవల అధికారులు ఓ అక్రమ బంగారు తవ్వకందారుల శిబిరంపై దాడి చేసి కూల్చేశారు.
ప్రత్యేక చర్యలను చేపట్టిన అనంతరం వేలమంది అక్రమ తవ్వకందారులను అక్కడి నుంచి వెళ్లగొట్టింది. తవ్వకాలు జరిపే వారి ఆవాస ప్రాంతాల్లో సైన్యం గస్తీ కాస్తోంది.

జవాన్ల నిత్య పర్యవేక్షణతో అమెజాన్ పరివాహక ప్రాంతాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తుంది ప్రభుత్వం.

లాటిన్ అమెరికా దేశాల్లో బంగారు ఉత్పత్తిలో పెరూ మొదటిస్థానంలో ఉంది. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. బంగారం కోసం అక్రమంగా జరిపిన తవ్వకాల్లో 2000-2015 వరకు అమెజాన్ పరిధిలోని 2లక్షల 38వేల కిలోమీటర్ల అటవి ప్రాంతం విధ్వంసానికి గురైంది.

ప్రభుత్వం, సైన్యం తీసుకుంటున్న చర్యలతో అక్రమ తవ్వకాలు ఆగిపోయి అమెజాన్ పరివాహక ప్రాంతం ప్రకృతి సోయగాలతో మళ్లీ కళకళలాడే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: వైద్యుడి పైశాచికం- 500మందికి హెచ్​ఐవీ!

ABOUT THE AUTHOR

...view details